డిచ్పల్లి, జూలై 15 : రాష్ట్రం పేరుతో ఏర్పాటైన తెలంగాణ యూనివర్సిటీలో నేడు స్నాతకోత్సవం(కాన్వకేషన్) నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పన్నెండేండ్ల తర్వాత రెండో స్నాతకోత్సవం నిర్వహిస్తుండడం గమనార్హం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ హాజరు కానుండగా, ముఖ్యఅతిథిగా ఐఐసీటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీవారి చంద్రశేఖర్ పాల్గొననున్నారు. జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య కాన్వకేషన్‌కు హాజరు కానున్నారు.
2006లో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడగా తొలి కాన్వకేషన్ 2013 నవంబర్ 13న అప్పటి వీసీ అక్బర్ అలీఖాన్ హయాంలో నిర్వహించారు. ఆ తర్వాత స్నాతకోత్సవం నిర్వహించలేదు. 2018, 2020లో కాన్వకేషన్ నిర్వహణకు అప్పటి వీసీలు సాంబయ్య, రవీందర్‌గుప్తా నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ నిర్వహించలేకపోయారు. గతేడాది అక్టోబర్‌లో నూతన వీసీగా బాధ్యతలు స్వీకరించిన యాదగిరిరావు కాన్వకేషన్ నిర్వహణకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ అయ్యింది.
స్నాతకోత్సం నేపథ్యంలో స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వీసీ యాదగిరిరావు తెలిపారు. వర్సిటీ క్రీడా మైదానంలో స్నాతకోత్సవం నిర్వహించనుండగా..సీపీ సాయిచైతన్య వీసీ, రిజిస్ట్రార్‌తో కలిసి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. వర్షం, ఈదురుగాలులు వీస్తే కార్యక్రమ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలుగకుండా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా జర్మన్ హ్యాంకర్ను తెప్పించారు.
టీయూలో స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ హాజరు కానున్నారు. ఉదయం స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం టీయూ నుంచి ఏడో బెటాలియన్‌కు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్న భోజనం అనంతరం జిల్లా కలెక్టరేట్‌కు చేరుకొని అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు కవులు, కళాకారులు, రాష్ట్ర, జాతీయ అవార్డు గ్రహీలతో సమావేశమై మాట్లాడుతారు. 4 నుంచి 4.40గంటల వరకు కలెక్టర్‌తో సమావేశమవుతారు.