హైదరాబాద్, జనవరి 7(నమస్తే తెలంగాణ): తెలంగాణ చరిత్రకు బోధన్ ప్రత్యక్ష సాక్షిగా నిలిచిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రముఖ పరిశోధకుడు సిద్ధ సాయిరెడ్డి రచించిన ‘తరతరాల బోధన్ చరిత్ర’ పుస్తకాన్ని శనివారం ఆయన హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రాచీన కాలం నుంచి భారతదేశ చరిత్రలో తెలంగాణ చరిత్రకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. ఆరవ శతా బ్దంలోని షోడశ మహా జనపదాల్లో ఒక రాజ్యమైన అస్మక రాజ్యం తెలంగాణ ప్రాంతపు అస్తిత్వంగా కొనసాగిందని, అదే నేటి బోధన్ ప్రాంతం కావడం గర్వించదగిన అంశమని అన్నారు.
తెలుగు సాహిత్యంలో నన్నయ కన్నా ముందే కావ్యాలు రాసిన పంప మహాకవి కూడా బోధన్ ప్రాంతానికి చెందిన వారే కావడం గమనించదగినదని గుర్తు చేశారు. అలాగే బోధన్ ప్రాంతంలో జైన మతం, బౌద్ధమతం, వైదిక మతం, హిందూ మతాలతోపాటు ఇస్లాం ఇతర సంప్రదాయాలు అన్ని విలసిల్లి సర్వమత సహనానికి, సకల మానవుల సహజీవన సౌందర్యానికి బోధన్ చరిత్ర ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సాంసృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.