కామారెడ్డి, ఏప్రిల్ 7 : పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ పారితోషికంతోపాటు కుల గణన పారితోషికాన్ని చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కామారెడ్డి పట్టణంలోని పదోతరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో మంగళవారం ఉపాధ్యాయ సంఘాల జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో టీచర్లు నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2025 మార్చిలో నిర్వహించిన పదో తరగతి స్పాట్ మూల్యాంకన విధుల పారితోషికం సుమారు రూ. 20 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. దీంతోపాటు రాష్ట్రంలో 50 వేల మంది సిబ్బందితో కుల గణన నిర్వహించి 18 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకూ పారితోషికం చెల్లించలేదని మండిపడ్డారు. మూల్యాంకన పారితోషికం ఏడేండ్లుగా పెంచడం లేదని, ఇంటర్ స్పాట్ రేట్లు రెండుసార్లు పెంచారని తెలిపారు.
పారితోషికం 50 శాతం పెంచాలని ఈ ఏడాది మూల్యాంకనం పూర్తి కాగానే స్పాట్ విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో టీటీజేఏసీ జిల్లా చైర్మన్ కుశాల్, యూఎస్పీసీ జిల్లా చైర్మన్ ఆకుల బాబు, చింతల లింగం, జాక్టో జిల్లా చైర్మన్ సయ్యద్ ఖలీముద్దీన్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు బషీర్, పంపరి ప్రవీణ్ కుమార్, ప్రభాకర్, యాదయ్య, స్వామిగౌడ్, అంబీర్ మనోహర్ రావు, గఫూర్ శిక్షక్, రంగా వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.