రామారెడ్డి, మే 25 :ఎండలు ముదురుతున్నాకొద్దీ ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. వేడితో వ్యాయాయం చేసేటప్పుడు కూడా కొంత చిరాగ్గా ఉంటుంది. అయితే ఉక్కపోత నుంచి ఉపశమనం, వేడి లేకుండా వ్యాయామం చేయడానికి ఈత కొట్టడం ఉత్తమమైన మార్గం. గ్రామీణ ప్రాంతాల్లో యువకులు చెరువులు, కుంటల్లో పట్టణ ప్రజలు స్విమ్మింగ్ పూల్స్‌కు వెళ్లి ఎండనుంచి కొంత ఉపశమనం పొందుతున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఈత నేర్చుకుంటున్నారు. స్విమ్మింగ్ శరీరానికి చక్కటి వ్యాయామం అంటున్నారు వైద్య నిపుణులు. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. రోజూ గంటపాటు ఈత కొడితే శరీరంలో అధికంగా క్యాలరీలు ఖర్చవుతాయి. స్విమ్మింగ్ కాళ్లు, చేతులు, కీళ్లపై దుష్ప్రభావం చూపదు. రామారెడ్డి మండల కేంద్రంలో సుమారు 30 మంది యోగా సాధకులు ఉదయం గంటపాటు ధర్మారం చెరువులో స్విమ్మింగ్ చేస్తున్నారు. నీటిపై శవాసనం సాధన చేస్తున్నట్లు చేతన యోగా గురువు గుండ హరినాథ్ తెలిపారు.
గుండె-రక్త పోటు నియంత్రణ..
ఈత శరీరాన్ని బయట నుంచి కాకుండా లోపల నుంచి కూడా ఆరోగ్యవంతంగా మార్చే వ్యాయామం. గుండె, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. స్విమ్మింగ్‌తో రక్తపోటు, మధుమేహం కూడా అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
నొప్పి నుంచి ఉపశమనం
ఈత శరీరానికి విశ్రాంతిని ఇచ్చే వ్యాయామం. ఇది కీళ్లు, వెన్నునొప్పి నుంచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఎముకలకు గాయమైనప్పుడు కూడా ఈత సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు.
ఒత్తిడి దూరం.. మంచి నిద్ర.. జీర్ణ వ్యవస్థ మెరుగు..
ఈత కొడితే శరీరం బాగా అలసిపోతుంది. చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది. స్విమ్మింగ్‌తో చాలావరకు ఒత్తిడి తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి త్వరగా ఆకలి అవుతుంది.
ఊపిరి తిత్తులకు బలం..
ఈత ఊపిరితిత్తులకు బలాన్నిస్తుంది. లంగ్స్‌లో ఆక్సిజన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎక్కువ కాలం శ్వాసను బిగపట్టుకునే సామర్థ్యం సైతం పెరుగుతుంది, ఆస్తమా రోగులకు కూడా ఈత చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు.
శరీరానికి పూర్తి వ్యాయామం..
ఈత కొడితే పూర్తి శరీరానికి వ్యాయామం అవుతుంది. ఈత కొట్టేటప్పుడు మన కాళ్లు, చేతులు నిరంతరం నీటిలో కదులుతుండడంతో బలాన్ని చేకూర్చుతుంది. కండరాలను టోన్ చేస్తుంది. శక్తిని పెంచుతుంది. ఊబకాయం ఉన్నవారు శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు.