పెద్దాయనకు భంగపాటు
నిజామాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లాకు నిరాశే ఎదురయ్యింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలవుతుండగా..మంత్రివర్గంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి ఎవరీకి చోటు దక్కలేదు. ఆదివారం జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి యోగం దక్కింది. కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైనప్పటి నుంచి ఇంతవరకూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఒక్కరికీ చోటు దక్కలేదు. క్యాబినెట్ కూర్పులో భాగంగా తప్పకుండా ఎవరికో ఒకరికి మంత్రియోగం పట్టుకుంటుందని అంతా ఆశించారు. కానీ అందుకు భిన్నంగా పరిస్థితులు వెలుగు చూశాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌కు మంత్రి పదవిని కట్టబెట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరో ఎమ్మెల్యేను మంత్రి చేశారు.
సీఎం సొంత జిల్లాకు ముచ్చటగా మూడో మంత్రి వచ్చాడు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు కనీసం ప్రాతినిధ్యం కరువైంది. సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అసలు ఏం జరిగిందో ఆదివారం తెల్లారే సరికి ఆ ఊసే లేకుండా పోయింది. కొత్త ఎమ్మెల్యేలకు చోటు దక్కలేదు. 18 నెలలుగా ఆశగా ఎదురు చూస్తున్న క్యాబినెట్ బెర్త్ వేరే జిల్లాలకు వెళ్లడంతో ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ నేతలంతా తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
భంగపాటే మిగిలింది..
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా, ఉమ్మడి జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కొనసాగుతున్నారు. 1999లో మొదటిసారి సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009లోనూ వరుసగా బోధన్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో వైఎస్.రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. 2018లోనూ షకీల్‌పై విజయం సాధించలేక చతికిలబడ్డారు. 2023లో బొటాబొటిన 3,062 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం కైవసం చేసుకున్నారు. మాజీ మంత్రిగా పని చేసిన అనుభవం ఉండడంతోపాటు కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పేరుంది.
టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి ముఖ్యమంత్రిగా అవకాశం దక్కించుకున్న రేవంత్ రెడ్డికి సుదర్శన్ రెడ్డి అత్యంత సమీప బంధువు. పీసీసీ చీఫ్‌గా పని చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు భారీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి బోధన్ ఎమ్మెల్యే బహిరంగంగానే సపోర్ట్‌గా నిలిచారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలవడం, సీఎంకు బంధువు కావడంతో బోధన్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయమనే ఉహాగానాలు చక్కర్లు కొట్టాయి. 18 నెలల నుంచి ఎక్కడ చూసినా ఇదే మాట వినిపించింది. ఒక దశలో హోంమంత్రి పోర్ట్ఫొలియో కూడా నిర్ణయం అయిపోయిందని సుదర్శన్ రెడ్డి సన్నిహిత వర్గాలు చెప్పుకున్నాయి. చివరికి భంగపాటు మాత్రమే మిగిలింది. మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడడం, చివరికి ఖాయమైన క్యాబినెట్ కూర్పులో పేరు లేకపోవడంతో బోధన్ ఎమ్మెల్యే తీవ్రంగా నొచ్చుకున్నట్లుగా తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాపై నిర్లక్ష్యం
నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ రేవంత్ క్యాబినెట్లో ఉమ్మడి జిల్లాకు చోటు లేకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి రాజుకుంటున్నది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ, ఉమ్మడి జిల్లా పరిపాలనలో ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు. ఉభయ జిల్లాల కలెక్టర్లు, సీపీ, ఎస్పీతో సమన్వయం చేసుకుంటూ పాలనను గాడిలో పెట్టడానికి మంత్రి అత్యవసరం. ఉమ్మడి జిల్లాకు అమాత్యుడు లేకపోవడంతో వెలితి కనిపిస్తున్నది. ఫలితంగా పాలనా వ్యవస్థలు గాడి తప్పుతున్నాయి. మంత్రివర్గ విస్తరణలో తనకే పదవి వరిస్తుందని జోరుగా ఉమ్మడి జిల్లా సమీక్షలు, సమావేశాలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిర్వహించారు. క్యాబినెట్ ర్యాంక్‌తో కూడిన ప్రొటోకాల్‌ను అనధికారికంగా పొందారు.
మంత్రి యోగం కలుగకపోవడంతో సమీక్ష లు, సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఇవే చివరి ఎన్నికలంటూ బోధన్‌లో గత అసెంబ్లీ పోరులో ప్రచారం చేసిన సుదర్శన్ రెడ్డికి పోటీగా మంత్రి పదవి రేసులో కొత్త ఎమ్మెల్యేలు సైతం పైరవీలు చేశారు. నలుగురు ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరికీ మంత్రి యోగం దక్కకపోవడంపై నిట్టూరుస్తున్నారు. ఇదేం తీరు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పలువురు ఎమ్మెల్యేల అనుచరులు, ఉమ్మడి జిల్లా ప్రజలు బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరుపై మండిపడుతున్నారు.