రెంజల్,అక్టోబర్ 17 : నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గ్రామానికి నిజామాబాద్ 1డిపో కు చెందిన ఆర్టీసీ బస్సులు సమయానికి నడపటం లేదంటూ కోపోద్రిక్తులైన విద్యార్థులు బస్సుకు అడ్డంగా బైఠాయించి ఆర్టీసీ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఉదయం 8 గంటలకు రావాల్సిన బస్సు 11గంటలకు వస్తే పరీక్షలు ఎలా రాసేదని విద్యార్థులు ప్రశ్నించారు. రెంజల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్స్‌కు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్టీసీ అధికారులు సమయపాలన పాటించక పోవటంతో క్లాస్‌లు మిస్సవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుగు ప్రయాణంలో సాట పూర్ గ్రామం వరకు సుమారు 5కిలో మీటర్లు ప్రతిరోజూ కాలి నడకన నడిచి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని వాపోయారు. పాఠశాలలకు ప్రతి రోజు ఆలస్యంగా చేరుకోవటంతో ప్రిన్సిపాల్ టిసి ఇచ్చి పంపుతమని బెదిరస్తునారన్ని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉదయం, సాయంత్రం పాఠశాలల వేళల్లో బస్సులు నడపాలని కోరుతున్నారు.