శక్కర్‌నగర్, అక్టోబర్ 28: ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఉదయం కళాశాలలకు వచ్చిన విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ కన్వీనర్ శశిధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాలల్లో చదివే విద్యార్థులు అర్ధంతరంగా చదువులు ఆపే పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. సర్కారు విద్యారంగాన్ని పటిష్టం చేస్తామని చెబుతున్న మాటలకు చేతలకు పొంతన లేదన్నారు. స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ప్రైవేట్ కళాశాలలు ఇటీవల మూడురోజులపాటు బంద్ పాటించి నిరసన వ్యక్తంచేసినా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.