డిచ్పల్లి, నవంబర్ 17 : నాసిరకం సామగ్రితో వంటలు చేస్తున్నారని తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ ఓల్డ్ బాయ్స్ హాస్టల్ విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయకుండా సోమవారం ఆందోళనకు దిగారు. వంటగదికి తాళం వేసి, వంట సరుకులను హాస్టల్ బయట పారబోసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. మెస్‌లో నాసిరకం సరుకులతో వంటలు చేస్తూ విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్డెన్, కేర్‌టేకర్ కొంతమంది విద్యార్థులతో చేతులు కలిపి హాస్టల్ సరుకులు పంపిణీ చేసే కాంట్రాక్టర్‌తో కుమ్మకై నాసిరకం వస్తువులు, గడువు తేదీ ముగిసిన సరుకులు వాడుతున్నారని మండిపడ్డారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడిపిస్తున్నారని, ఇందులో వార్డెన్, కేర్‌టేకర్లతో పాటు చాలా మంది పాత్ర ఉన్నదని విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ యాదగిరి విద్యార్థులతో మాట్లాడారు. సామగ్రి సరఫరా చేసే వ్యక్తిని మందలించారు. కాలం చెల్లిన సామగ్రి పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ విద్యార్థులకు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.