శక్కర్‌నగర్, జనవరి 27 : బోధన్ మండలంలోని ఖండ్గామ్కు చెందిన విద్యార్థి హంచుగుండె శ్రీకాంత్‌ది ఆత్మహత్యేనని నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ జి. రమేశ్ వెల్లడించారు. బోధన్ పట్టణ పో లీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబర్ 23న ఇంటి నుంచి వెళ్లిన శ్రీకాంత్ అదృశ్యం కావడం, సుమారు మూడు నెలల అనంతరం 12 డిసెంబర్ 2022న బోధన్ పట్టణ శివారులోని పసుపువాగులో అస్థిపంజరంగా లభ్యం కావడం పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సంఘటనలో శ్రీకాంత్‌ను కొందరు వ్యక్తులు బెదిరించారని, వారే ఈ హత్య కు పాల్పడి ఉంటారని ఆరోపిస్తూ కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. అయితే, ఈ సంఘటనలో స్థానిక పోలీసులపై తమకు నమ్మకం లేదని చెప్పడంతో కేసు విచారణను సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు ఆరోపిస్తూ ఐదుగురు వ్యక్తులు శ్రీకాంత్‌ను బెదిరించడంతో.. కుటుంబం పరువు పోతుందనే భయంతో పసుపువాగు సమీపంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వి చారణలో తేలిందని ఏసీపీ రమేశ్ స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో విచారణ జరిపామని, వైద్యులు అందించిన పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో పాటు సాంకేతికంగా పలు కోణాల్లో విచారణ అనంతరం శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలిందని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో బోధన్ పట్టణ సీఐ బీడీ ప్రేమ్ కుమార్, సీసీఎస్ ఎస్సై వై. రాజశేఖర్, ఇన్స్పెక్టర్ టి. శ్రీధర్‌తో పాటు సిబ్బంది ఉన్నారు.
శ్రీకాంత్‌ను బెదిరించి ఆత్మహత్యకు కారణమైన ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీసీఎస్ ఏసీపీ జి. రమేశ్ తెలిపారు. బోధన్ మండలంలోని సాలూరా క్యాంపునకు చెందిన అన్నెం వెంకటేశ్వర్ రెడ్డి, పాపిరెడ్డి, సూర వెంకటేశ్వర్ రెడ్డితో పాటు వర్ని మండలం చింతకుంట గ్రామానికి చెందిన ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, బోధన్ మండలంలోని సాలూరా గ్రామానికి చెందిన పల్లె తిరుమల రెడ్డిపై కేసు నమోదు చేయడంతో పాటు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన వెల్లడించారు.