HbA1c | ప్రపంచ వ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా అందరూ డయాబెటిస్ తో బాధపడుతున్నారు. శరీరం ఇన్సులిన్ ఉత్పత్తిని ఆపేసినప్పుడు లేదా ఇన్సులిన్ నిరోధకతను అభివృద్ది చేసినప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. నియంత్రణ కూడా కష్టమవుతుంది. డయాబెటిస్ ఉన్న వారికి దాని లక్షణాలు చెప్పడంతోపాటు వైద్యులు HbA1c పరీక్ష చేయించుకోమని సలహా ఇస్తూ ఉంటారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోమని సూచిస్తూ ఉంటారు. అసలు డయాబెటిస్ తో బాధపడే వారు HbA1c రక్తపరీక్ష ఎందుకు చేయించుకోవాలి. HbA1c రక్తపరీక్ష అంటే ఏమిటి.. దీనిని ఎవరూ చేయించుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ లక్షణాలు కనిపించినప్పుడు వైద్యులు మొదట పరగడుపుతో చక్కెర స్థాయిలను పరీక్షిస్తారు. పరగడుపున చేసే పరీక్షల్లో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు HbA1c పరీక్ష చేస్తారు. దీని ద్వారా వ్యక్తికి డయాబెటిస్ ఉందా లేదా నియంత్రణ ఎలా ఉంది, రక్తంలో చక్కెర స్థాయిలు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తుంది. HbA1c పరీక్ష రక్తంలో గ్లైకోసైలేటెడ్ హిమోగ్లోబిన్ స్థాయిని కొలుస్తుంది. హిమోగ్లోబిన్ రక్తంలో ఆక్సిజన్ ను మోసే ప్రోటీన్, గ్లూకోజ్ తో కలిసి HbA1c ని ఏర్పరుస్తుంది. ఈ రక్తపరీక్ష గత మూడు నెలల్లో రక్తంలో సగటు చక్కెర స్థాయిని తెలియజేస్తుంది. డయాబెటిస్ ను తెలుసుకోవడానికి ఇది అత్యంత నమ్మదగిన మార్గంగా పరిగణిస్తారు. మధుమేహం ఉన్న వారికి లేదా లక్షణాలు ఉన్న వారు ఈ పరీక్ష తప్పక చేయించుకోవాలి.
అలాగే జన్యుపరంగా మధుమేహం వచ్చే అవకాశం ఉన్న వారు కూడా ఈ పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. ఇక ఆరోగ్యకరమైన వ్యక్తిలో HbA1c స్థాయి 5.7 కంటే తక్కువగా ఉంటుంది. 5.7 నుండి 6.4 మధ్య స్థాయిలు ప్రీడయాబెటిస్ ను సూచిస్తాయి. HbA1c స్థాయిలు ఎంత ఎక్కువగా ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు అంత తీవ్రంగా ఉన్నాయని అర్థం. ఈ పరీక్ష చేయించుకోవడం వల్ల గుండె, మూత్రపిండాలు, కళ్లు, నరాలకు నష్టాన్ని కలగకుండా నివారించవచ్చు. అదే విధంగా డయాబెటిస్ ఉన్న వారు ప్రతి 3 లేదా 6 నెలలకు ఒకసారి HbA1c పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. ప్రీడయాబెటిస్ ఉన్న వారు క్రమం తప్పకుండా ఈ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. దీని వల్ల మనం సకాలంలో తగిన చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. డయాబెటిస్ నియంత్రణకు HbA1c పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. ఇది వ్యాధి తీవ్రతను నిర్ణయించడమే కాకుండా తగిన చికిత్స తీసుకోవడంలో, జీవనశైలిలో మార్పులకు సహాయపడుతుంది. డయాబెటిస్, దాని లక్షణాలతో బాధపడే వారే కాకుండా ఆరోగ్యకరమైన వ్యక్తులు కూడా HbA1c రక్తపరీక్ష చేయించుకోవచ్చు. దీని వల్ల డయాబెటిస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.