కోటగిరి/మాక్లూర్/నవీపేట, ఆగస్టు 20 : యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరిట ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి పాలసీకి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. జీవో 97ను రద్దు చేయాలంటూ మాక్లూర్, కోటగిరి, నవీపేట తదితర ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. తమ భవిష్యత్తును దెబ్బతీసేలా ఐటీఐలను పాలిటెక్నిక్ కళశాలల్లో విలీనం చేసేలా రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన జీవో 97 రద్దు చేసేంత వరకూ ఉద్యమం ఆగదని విద్యార్థులు స్పష్టం చేశారు. నవీపేటలో పాలిటెక్నిక్ కళాశాలను బంద్ చేయించిన విద్యార్థులు.. అనంతరం ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. మాక్లూర్ మండలం దాస్నగర్లోని విజయ్ రూరల్ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కోటగిరిలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు బంద్ పాటించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మూడేండ్ల పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ డిప్లామా స్థాయిని, సర్టిఫికెట్ స్థాయి ఉండే ఐటీఐలతో కలపడంతో డిప్లమా ప్రమాణాలు తగ్గిపోవడమే కాకుండా దాని మార్కెట్ విలువ కూడా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను కార్పొరేట్ చేతుల్లోకి నెట్టేందుకు ఈ మార్పులు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులతో కానీ, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులతో కానీ, మేధావులు, విద్యార్థి సంఘాలతో కానీ చర్చించకుండా జీవో 97 విడుదల చేయడం పై మండిపడ్డారు. సదరు జీవోను తక్షణమే రద్దు చేసి, ఇప్పుడున్న పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.