భిక్కనూరు, జనవరి 7: ప్రాణాలైనా అర్పిస్తాం.. ఫార్మా కంపెనీని అడ్డుకుంటామని భిక్కనూరు ప్రాంత ప్రజలు ముక్త కంఠంతో నినదించారు. భిక్కనూరు మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫ్యూజన్ హెల్త్ కేర్ ఫార్మా కంపెనీ విషయమై కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, కాలుష్య నియంత్రణ మండలి ఉమ్మడి జిల్లా అధికారి లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. కార్యక్రమానికి యువత, ఆయా గ్రామాల ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు, మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల అభిప్రాయాలను అధికారులు రికార్డు చేశారు. ఈ సందర్భంగా ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదివరకు ఉన్న ఫార్మా కంపెనీతో తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కొంటున్నామని, పిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. పంట భూములు నాశనం అయ్యాయని, బోరు బావుల నుంచి కలుషిత నీరు వస్తున్నదన్నారు. గతంలో ఫార్మా కంపెనీ వద్దని నెలల తరబడి దీక్షలు చేశామని, కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం కొందరు రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం కంపెనీ ఏర్పాటుకు అనుకూలంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Nuthana Farma Company Maku
పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించడంపై ఆగ్రహం..
ప్రజాభిప్రాయ సేకరణను పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమానికి కొందరు ఇతర ప్రాంతాల నుంచి హాజరై.. కంపెనీ ఏర్పాటుకు అనుకూలంగా వినతిపత్రం ఇవ్వనున్నట్లు గుర్తించిన స్థానికులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు కల్పించుకొని.. వారిని కార్యక్రమం నుంచి బయటికి పంపించివేశారు.
నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం..
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ.. కార్యక్రమంలో వచ్చిన వినతులను స్వీకరించినట్లు తెలిపారు. మొత్తం 39 మం ది మాట్లాడుతూ.. కంపెనీ ఏర్పాటును వ్యతిరేకించారని అన్నారు. వారి మాటలను రికార్డు చేశామని, ఫిర్యాదులు, రికార్డులను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. కామారెడ్డి ఏఎస్పీ చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్సైలు, వంద మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు
భిక్కనూరు బంద్ ప్రశాంతం..
ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బుధవారం నిర్వహించిన భిక్కనూరు బంద్ ప్రశాంతంగా ముగిసింది. అఖిల పక్ష నాయకులు, భిక్కనూరు గ్రామస్తులు ఇచ్చిన పిలుపు మేరకు వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసి ఉంచారు. బంద్కు అందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.