మోర్తాడ్, జూలై 1: ఎవరెన్ని సర్కస్ ఫీట్లు వేసినా.. తెలంగాణపై విషం చిమ్మినా..ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ తెలంగాణలో గెలుపు సాధిస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం మోర్తాడ్ మండలం సుంకెట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు తీగెల సంతోష్ అతని అనుచరులతో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ దయతో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. సాగునీటి రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పు, మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన వైద్యసేవలు, బీటీ, సీసీ రోడ్లు వేసుకోవడం, బడుగుబలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంతో నియోజకవర్గం సుభిక్షంగా ఉందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను కంటికిరెప్పలా కాపాడుకుంటానని మంత్రి అన్నారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇక్కడి సంక్షేమ పథకాలతో ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్నారు.
అబ్‌కీబార్ కిసాన్ సర్కార్ అంటూ దేశ మార్పు కోసం బయల్దేరిన కేసీఆర్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పచ్చగా ఉన్న తెలంగాణ మీద బీజేపీ విషం చిమ్ముతుందని, కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నదన్నారు. ఎవరెన్నీ కుట్రలు పన్నినా సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నదని, మరోసారి గులాబీ జెండాను ఎగురవేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, ఉపాధ్యక్షుడు సుభాష్, సర్పంచ్ శ్రీనివాస్, పృథ్వీ, పరమేశ్, సందీప్, సత్యం, నవీన్, రవి, ఆరీఫ్, చిరంజీవి, చిన్నరాజన్న తదితరులు పాల్గొన్నారు.