కమ్మర్పల్లి, జూలై 5: రాష్ట్ర ప్రభుత్వం అందించిన పట్టాలతో పోడు భూములను గిరిజనులు దర్జాగా సాగు చేసుకోవచ్చని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండలం దొమ్మర్చౌడ్ తండాలో లబ్ధిదారులకు బుధవారం పోడు భూములకు పట్టా పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. అమీర్‌నగర్ తండా, సర్పంచ్ తండా, డీసీ తండా, కోనాపూర్ కేసీతండా, ఉక్లానాయక్ తండా, సోమిడి తండా, బీల్యానాయక్ తండా, గుడి లింగాపూర్ తండాలకు చెందిన 190 మంది లబ్ధిదారులకు మొత్తం 590 ఎకరాల పోడు భూమికి సంబంధించిన పట్టాలను అందజేశారు.
ఇందుకోసం ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా గ్రామపంచాయతీల వారీగా ప్రత్యేక కౌంటర్లును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ… లబ్ధిదారులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేకుండా హద్దులతో కూడిన సమగ్ర నక్షతో ప్రభుత్వం పక్కగా పట్టా పాసుబుక్కులను అందిస్తున్నదని తెలిపారు. ఎన్నో ఏండ్లుగా గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేయాలనే సంకల్పంతోనే సీఎం కేసీఆర్ హక్కులు కల్పించారని చెప్పారు. లబ్ధిదారులకు రైతుబంధు, రైతుబీమా వర్తిస్తుందని తెలిపారు. తరతరాలకు జీవనోపాధిని అందించే భూములను అమ్ముకోవద్దని మంత్రి హితవు పలికారు. ఇకపై అడవుల జోలికి వెళ్లొద్దని సూచించారు. అర్హులకు పట్టాలు రాకపోతే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.