భిక్కనూరు, ఏప్రిల్ 29: రైతులు సేంద్రియ సాగును అలవర్చుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి పి. శ్రీసుధ సూచించారు. విత్తనాల కారణంగా పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోతే రైతులు నష్టపరిహరం పొందే వీలు ఉన్నదని తెలిపారు. శనివారం ఆమె భిక్కనూరు రైతువేదికలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో ఇచ్చిన రసీదులు, కొన్ని విత్తనాల శాంపిళ్లు, బ్యాచ్ నంబర్ తదితర వివరాలను రైతులు తమ వద్ద ఉంచుకొని ఫిర్యాదు చేయాలని సూచించారు. పురుగు మందులు పనిచేయకపోతే వాటి బిల్లు, కంపెనీ వివరాలతో ఫిర్యాదు చేస్తే తగిన పరిహారం పొందే అవకాశం ఉందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించడంతో గిట్టుబాటు ధర రాక మోసపోతున్నారని అన్నారు. సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ధాన్యం పండించి ఆన్లైన్ ద్వారా విక్రయిస్తే రైతులు గిట్టుబాటు ధర పొందే వీలున్నదని వివరించారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ.. రైతులు అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. అకాల వర్షాలతో జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాల సేకరణ యుద్ధప్రాతిపదికన చేపడుతున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా జడ్జి శ్రీదేవి, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, సర్పంచ్ తునికి వేణు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంద రమేశ్, ఏడీఏ అపర్ణ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాంచంద్రం, డీసీసీబీ డైరెక్టర్ సిద్ధరాములు, సింగిల్ విండో చైర్మన్లు భూమయ్య, రాజాగౌడ్, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.