బీబీపేట్/మాచారెడ్డి, మే10: ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనుగోలు చేయకుండా తమను ఆగం చేస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలతో ధాన్యం తడిసి తీవ్రంగా నష్టంపోతున్నామని, తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా, పాల్వంచ మండల కేంద్రంలోని కామారెడ్డి-సిరిసిల్ల రహదారిపై రైతులు శుక్రవారం ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టకుండా వడ్లు కొనేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వ యంత్రాంగం తాత్సారం చేయడంతో వర్షాలకు తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్‌మిల్లర్లు సైతం పెద్దమొత్తంలో తరుగు తీస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీబీపేట్ సొసైటీ పరిధిలోనే ఇప్పటి వరకు 24 వేల తడిసిన ధాన్యం బస్తాలు ఉన్నాయన్నారు. వాటిని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పాల్వంచలో అధికారులు స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. బీబీపేట్‌లో రైతులకు జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్‌కుమార్, ఎంపీపీ బాలమణి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి దేవునిపల్లి శ్రీనివాస్ తదితరులు మద్దతు తెలిపి కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగట్టారు.