శక్కర్‌నగర్, జూలై 13: బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దవాఖానలో శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ తదితర విభాగాల్లో అవుట్ సోర్సింగ్ ద్వారా సిబ్బందిని నియమించారు. వీరికి వేతనాలు చెల్లించే కాంట్రాక్టర్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కాగా, సబ్ కాంట్రాక్టర్‌గా నిజామాబాద్‌కు చెందిన వ్యక్తి కొనసాగుతున్నారు. అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు అందకపోయినా..విధులు మాత్రం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.
నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో అప్పు చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్నారు. నాలుగు నెలలుగా వేతనాల అందకపోవడంలేదనే విషయం బయటికి చెబితే అధికారులు, కాంట్రాక్టర్ ఇబ్బందులకు గురిచేయవచ్చని ఆందోళన చెందుతున్నారు. వారికి వేతనాల చెల్లింపులో మాత్రం అధికారులు, కాంట్రాక్టర్ స్పందించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిలో మూడుసార్లు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నారు. దవాఖానలో అవుట్సోర్సింగ్ విధానం ద్వారా శానిటేషన్ విభాగంలో 19 మంది, సెక్యూరిటీ విభాగంలో 12 మంది, పేషెంట్ కేర్ విభాగంలో12 మందితోపాటు సూపర్వైజర్లుగా ఇద్దరు విధులు నిర్వర్తిస్తున్నారు. నెలనెలా వేతనాలు అందకపోయినా వారు పారిశుద్ధ్య పనులు చేపడుతుండడంతో దవాఖాన పరిసరాలు శుభ్రంగా ఉంటున్నాయి.
ఏడాదిలో మూడు లేదా నాలుగు సార్లు వేతనాలు
నేను 20 ఏండ్లుగా దవాఖాన లో పనిచేస్తున్న. ఎప్పుడూ నెలనెలా వేతనాలు అందవు. గతంలో రెండు నెలలకోసారి వేతనాలు ఇచ్చేవారు. ఇప్పుడు నాలుగు నెలలు పూర్తయినా వేతనాలు అందలేదు. పాఠశాలలు ప్రారంభంకావడంతో విద్యార్థులకు ఫీజులు కట్టి, పుస్తకాలు కొనుగోలు చేయడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నం. మాకు వేతనాలను త్వరగా ఇప్పించాలి.
-భీంరావు, శానిటరీ వర్కర్
నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడంలేదు..
నాలుగు నెలలుగా వేతనాలు లేవు. సుమారు 30 ఏండ్ల కాలంగా ఈ దవాఖానాలో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నాను. వేతనాలు ఇవ్వాలంటూ భయపడుతూ అడగాల్సిన పరిస్థితి. వేతనాలు అందకపోయినా విధులు మాత్రం నిర్వర్తిస్తూ వస్తున్నాం. వేతనాలు వస్తాయనే ఆశతో బయట అప్పులు చేసి కాలం వెళ్లదీస్తున్నాం. అధికారులు మా బాధలను గుర్తించి వేతనాలు అందించాలని కోరుతున్నాం.
-నాగమణి, సానిటేషన్ వర్కర్