నిజామాబాద్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎడారిని తలపిస్తున్నది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండిపోతున్నది. కేసీఆర్ హయాంలో మండుటెండల్లోనూ నిండుగా కనిపించిన ఎస్సారెస్పీ.. నేడు ఎండలు ముదరక ముందే ఎండిపోతున్నది. ప్రభుత్వ అనాలోచిత వైఖరి కారణంగా మే మొదటి వారంలోనే డెడ్ స్టోరేజ్ ముప్పు తలెత్తే పరిస్థితి కనిపిస్తున్నది. ప్రాజెక్టులో రోజురోజుకూ నీటిమట్టం తగ్గుతుండడంతో రానున్న రోజుల్లో తాగునీటి అవసరాలు కూడా తీర్చలేని దుస్థితి తలెత్తే ప్రమాదం పొంచి ఉన్నది. మరోవైపు, వానకాలం ఆరంభంలో వర్షాలు ఆలస్యమైతే పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతుల్లో ఇప్పటి నుంచే ఆందోళన రేకెత్తుతున్నది.
ఎస్సారెస్పీ ఎప్పుడూ నీటితో కళకళలాడాలన్న సదుద్దేశంతో కేసీఆర్ పునరుజ్జీవ పథకాన్ని చేపట్టారు. గోదావరి జలాలను ఎదురెక్కించి శ్రీరాంసాగర్‌లో ఎత్తిపోశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించడంతో ఎండాకాలంలోనూ తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది. కానీ కాంగ్రెస్ వచ్చాక పునరుజ్జీవ పథకాన్ని పక్కన పడేసింది. ప్రస్తుతం ఎస్సారెస్పీ ఎండిపోతున్న తరుణంలో మోటర్లు ఆన్ చేస్తే దిగువన కాళేశ్వరం నుంచి పోచంపాడ్‌కు నీటిని తరలించవచ్చు. కానీ, ఎక్కడ కేసీఆర్‌కు పేరు వస్తుందోనన్న భయంతో రేవంత్ సర్కారు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు.
రుతుపవనాల ఆగమనాన్ని ఎవరూ ఊహించలేరు. దురదృష్టవశాత్తు వానలు ఆలస్యమైతే ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో గొంతెండడం ఖాయంగా కనిపిస్తున్నది. తాగు, సాగు నీటికి ఆయువు పట్టుగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు భవితవ్యంపైనే జన జీవనం కూడా ఆధారపడి ఉన్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని గుర్తించడం లేదు. గతేడాది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఎస్సారెస్పీ డెడ్ స్టోరేజ్‌కి చేరింది. సమయానికి వానలు కురవడంతో ఇబ్బందులు ఎదురవలేదు.
ఈసారి వానలు ఆలస్యమయ్యే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ముందే కండ్లు తెరవాల్సిన అవసరం ఉంది. లేకపోతే తాగు, సాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదమున్నది. వర్షాలు పడకపోయినా కేసీఆర్ కాళేశ్వరం నీళ్లతో పోచంపాడ్‌ను నింపారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. రైతుల ప్రయోజనాలే ముఖ్యమని కాంగ్రెస్ పాలకులు భావించి ఉంటే ఇప్పటికే పునరుజ్జీవ పథకంలోని మోటర్లు నడిచేవి. కానీ అలా జరగలేదు. ఏడాదిన్నర కాలంగా ముప్కాల్ పంప్‌హౌస్ బోసిపోతున్నది. భారీ మోటార్లు ఉత్సవ విగ్రహాల్లా మారాయి. కేసీఆర్ సృష్టించిన జల అద్భుతాన్ని రాజకీయ కుట్రలో భాగంగా నిలిపేసి రైతులకు ఇక్కట్లు సృష్టించడం భావ్యం కాదని అన్నదాతలు వాపోతున్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సాగునీటిశాఖ గణాంకాల ప్రకారం 2023 మార్చి 23వ తేదీన ఎస్సారెస్పీలో 1071.70 అడుగుల (32.487 టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నది. అదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 మార్చి 23న నీటి నిల్వ ఘోరంగా పడిపోయింది. గతేడాది మార్చి 23న 1063.80 అడుగుల (14.545 టీఎంసీలు) నీరు ఉన్నది. ఈసారి కూడా ఎస్సారెస్పీలో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయి చేరాయి.
శుక్రవారం నాటికి 1,063 అడుగు ల (14.356 టీఎంసీల)కే నీటి నిల్వలు పరిమితమయ్యాయి. ఆయకట్టు చివరి తడి కోసం 5,864 క్యూసెక్కుల మేర నీటిని వదులుతున్నారు. కాకతీయ ప్రధాన కాలువ ద్వారా 3,500, లక్ష్మి కెనాల్‌కు 250, అలీసాగర్ ఎత్తిపోతలకు 240, గుత్ప ఎత్తిపోతలకు 270, చిన్ననీటి ఎత్తిపోతలకు312, సరస్వతి కెనాల్‌కు 700 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి కోసం 231 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు.
రోజుకు 484 క్యూసెక్కులు ఆవిరి రూపంలో పోతున్నది. ప్రస్తుతం నీటి నిల్వ 14 టీఎంసీలుండగా, భవిష్యత్తు అవసరాలకు సరిపోతాయా.. లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏప్రిల్ మొ దటి వారంలోనే నీటి నిల్వ కనిష్ఠ స్థాయికి చేరుతున్నప్పటికీ, ప్రభుత్వానికి ముందుచూపు కరువైంది. కేసీఆర్ హయాంలో జల కళతో ఉట్టిపడిన పోచంపాడ్ ప్రాజెక్టు.. కాంగ్రెస్ పాలనలో గతేడాది డెడ్ స్టోరేజ్‌కి చేరింది. ఈసారి కూడా అదే పరిస్థితి తలెత్తే ప్రమాదమున్నదని రైతులు వాపోతున్నారు. 2024 జూన్ 1 నుంచి నేటి వరకు పోచంపాడ్‌కు 287.562 టీఎంసీలు ఇన్‌ఫ్లో రాగా, 287.719 టీఎంసీలు ఔట్ ఫ్లో రూపంలో వెళ్లింది.ఈ నెల 9 వరకు ప్రాజెక్టు నుంచి మరో 5 టీఎంసీలు విడుదల చేయనున్నారు. దీంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కేసీఆర్ ఊపిరి పోశారు. ఏటా ఎండిపోయే ప్రాజెక్టుకు జలకళను తీసుకొచ్చారు. 2023 వరకు పోచంపాడ్ ప్రాజెక్టు ఏ కాలంలోనైనా నిండా నీళ్లతో కనిపించేది. ఇప్పుడు ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో గడ్డుకాలం దాపురించింది. పాత కాలం నాటి రోజులు మళ్లీ వచ్చినట్లు అనిపిస్తున్నది.
– గుండేటి మోహన్ రెడ్డి, రైతు, బాల్కొండ
ప్రభుత్వానికి ముందుచూపు లేదు. ఎస్సారెస్పీ ఎండితే లక్షలాది ఎకరాలకు నష్టం జరుగుతుంది. పునరుజ్జీవ పథకం ద్వారా కేసీఆర్ పాలనలో శ్రీరాంసాగర్‌లో నిత్యం నిండు గా జలాలు ఉండేవి. రేవంత్‌రెడ్డి వచ్చిన కొద్ది రోజులకే ఎస్సారెస్పీ డెడ్ స్టోరేజ్‌కు వెళ్లింది. ఈసారి కూడా అదే పరిస్థితి దాపురించేలా ఉన్నది. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నడుచుకోవాలి.
– శ్రీకాంత్ యాదవ్, రైతు, బాల్కొండ