ఉమ్మడి జిల్లాలో ఆదివారం శ్రీరామ నవమి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే రామాలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఖిల్లా రఘునాథాలయం, సుభాష్‌నగర్ రామాలయం, బ్రహ్మపురి పెద్దరాంమందిరం, మాధవ్‌నగర్, న్యాల్కల్రోడ్లోని కోదండ రామాలయం, జెండా బాలాజీ మందిరం, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామాలయంతోపాటు పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పోచంపాడ్‌లోని కోదండ రామాలయంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి దంపతులు పట్టువస్ర్తాలను సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
-సుభాష్‌నగర్, ఏప్రిల్ 6