రెంజల్, ఏప్రిల్ 11: ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ బలిరాం హెడ్గేవార్ పూర్వీకుల గ్రామం కందకుర్తి చరిత్రలో నిలిచిపోతుందని, మట్టిలోని ప్రతి అణువూ.. దేశ భక్తి గల సమాజ నిర్మాణం, ప్రేరణ కోసం స్ఫూర్తిని నింపింది ఇక్కడేనని ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్‌భగవత్ అన్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో నిర్మించిన శ్రీ కేశవ స్ఫూర్తి మందిరాన్ని మోహన్‌భగవత్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు.
మూడంతస్తుల భవనంలో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని తిలకించారు. హెడ్గేవార్, శివాజీ మహారాజ్, భారతమాత విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోహ న్ భగవత్ మాట్లాడుతూ.. సమాజంలో గుణాత్మకతను తీసుకురావడంలో హెడ్గేవార్ కృషి వెలకట్టలేనిదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క రూ భారతీయ ఇతీహాసం తెలుసుకొని లోక కల్యాణం కోసం సేవచేసేందుకు కంకణ బద్దు లు కావాలని పిలుపునిచ్చారు. హెడ్గేవార్ పూర్వీకులు పుట్టిన పుడమి తల్లి గర్భంలో జన్మించిన ప్రజలు పూర్వజన్మ సుకృతులేనని అభివర్ణించారు.
దేశ భక్తి, సంస్కృతీ సంప్రదాయాలు ప్రతి ఒక్కరిలో ప్రేరణ కలిగేలా తెలంగాణనే కాకుండా, యావత్ భారతదేశ ప్రజలు హెడ్గేవార్ స్ఫూర్తి కేంద్రంలో ఇతీహాసం తెలుసుకునేందుకు ఏడాదిలో ఒక్కరోజైనా సమయాన్ని కేటాయించాలని కోరారు. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సంఘచాలక్ సుందర్‌రెడ్డి, దక్షిణ మధ్యక్షేత్ర సహసంచాలక్ రామకృష్ణ, తెలంగాణ ప్రాంత సేవా భారతి అధ్యక్షుడు దుర్గారెడ్డి, కేశవ సేవాసమితి అధ్యక్షుడు చామకూర సుధాకర్‌రెడ్డి, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, రాకేశ్‌రెడ్డి, రామారావుపాటిల్, తదితరులు పాల్గొన్నారు.