దసరా.. హిందువులకు ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ ప్యాఢమి నుంచి ఆశ్వయుజ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రి.. పదో రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ప్రధానంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నరాత్రి అంటారు. శరదృతువులో వచ్చే పండుగ కాబట్టి ఈ పేరు వచ్చింది. నవరాత్రి అనే పదం శబ్దార్థ ప్రకారంగా.. సంస్కృతంలో తొమ్మిది రాత్రులని అర్థం. నవ అంటే తొమ్మిది. రాత్రి అంటే రాత్రులు అని అర్థం.
ఈ తొమ్మిది రాత్రులు.. పది రోజుల్లో.. తొమ్మిది రూపాల్లో ఉన్న శక్తి (అమ్మవారు)ని ఆరాధిస్తారు. కొందరు ఈ పండుగ మొదటి మూడు రోజులు పార్వతీదేవిని, తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవి, ఆ తర్వాత మూడు రోజులు సరస్వతీ మాతకు పూజలు నిర్వహిస్తారు. నవరాత్రుల్లో సామాన్యుల నుంచి యోగుల వరకు అమ్మవారిని పూజిస్తారు. తొమ్మిది రోజుల్లో అమ్మవారు తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. లోక కల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తారు. తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో మహిళలు, చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరూ అమ్మవారిని పూజిస్తారు.
మాలధారణకు సిద్ధం..
దేవి శరన్నవరాత్రుల సందర్భంగా మాలధారణ వేసుకోవడానికి నగరంలో యువకులు సిద్ధమయ్యారు. తొమ్మిది రోజుల పాటు నియమ నిష్టలతో ఆధ్యాత్మిక చింతన ద్వారా మానసిక ప్రశాంతత ప్రాప్తిస్త్తుంది. క్రమశిక్షణ గల ఆధ్మాత్మిక వాతావరణంతో సర్వం సిద్ధిస్తాయని విశ్వసిస్తారు. ఉదయం 10గంటలకు అమ్మవారి పూజ, సాయంత్రం 6గంటలకు మంగళహారతులతో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు.
1వ రోజు
1 Shailputri
దుర్గానవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజున అమ్మవారు శైలపుత్రి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజున విశేష సంకల్పం. కలష గణపతి పూజ, బ్రహ్మకలశ స్థాపన, అమ్మవారి అలంకరణ నిత్యపూజలో లలితార్చన, మహానివేదన, నీరాజనం, మంత్రపుష్పాల సమర్పణ ఉంటుంది.
2వ రోజు
2 Brahmacharini
నవరాత్రుల్లో రెండోరోజైన సోమవారం శ్రీదుర్గామాత బ్రహ్మచారిణి రూపంలో వెలుస్తారు. ఈ రోజు నిత్యవిధి పూజలు నిర్వహిస్తారు.
3వ రోజు
3 Chandraghanta
మూడో రోజున మంగళవారం దుర్గామాత చంద్రఘంట అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి నిత్యవిధి పూజలు, భక్తుల సేవలు నిర్వహిస్తారు.
4వ రోజు
4 Kushmanda
నవరాత్రుల్లో నాలుగో రోజైన బుధవారం శ్రీమాత కూష్మాండ రూపంలో దర్శనమిస్తారు. నిత్యవిధి పూజలు, కైంకర్యాలు, ప్రసాదాల సమర్పణలు నిర్వహిస్తారు.
5వ రోజు
5 Skandamata
నవరాత్రులో ఐదో రోజు గురువారం శ్రీమాత స్కందమాత అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజున నిత్యపూజలు, అర్చనలు నిర్వహిస్తారు.
6వ రోజు
6 Katyayani
ఆరో రోజైన శుక్రవారం దుర్గమ్మ శ్రీకాత్యాయిని మాత అవతారంలో వెలుస్తారు. పెళ్లికాని వారు ఈ రోజు అమ్మవారికి విశేష పూజలు చేస్తారు. ఇలా చేస్తే తప్పకుండా తగిన వరుడితో వివాహం జరుగుతుందని నమ్మకం. ఈ కాత్యాయిని అమ్మవారిని మరోరకంగా శాకాంబరి అమ్మవారిగా పూజిస్తారు.
7వ రోజు
7 Kaalratri
నవరాత్రులో ఏడో రోజైన శనివారం అమ్మవారిని కాళరాత్రిగా సంభోదిస్తారు. ఈ అవతారాన్ని కాళికామాత రూపంగా కొలుస్తారు. ఐదు రూపాల అనంతరం అమ్మవారు తీవ్ర ఉగ్ర రూపానికి వస్తారని దేవి భాగవతంలో పేర్కొనబడింది. అమ్మవారు మిగిలిన ఈ నాలుగు రోజుల్లో కపాళ మాలలు, చేతులకు, భుజాలకు కాలకూట విషాలు కక్కే సర్పాలను అలంకార వస్తువులుగా ధరించి, నీలివర్ణంతో భీకర ఆకారంగా రాక్షసులపై దండెత్తుతుంది. ఈ సంవత్సరం మూలా నక్షత్రం సరస్వతీ నక్షత్రం కూడా 7వ రోజున రావడం విశేషం. సరస్వతీ అమ్మవారుగా దుర్గామాత పూజలందుకుంటారు. మూలా నక్షత్రం రోజున ఏ అమ్మవారి దేవాలయాల్లో అయినా నవరాత్రుల్లో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం విశేషం.
8వ రోజు
8 Mahagauri
నవరాత్రుల్లో ఎనిమిదో రోజైన ఆదివారం దుర్గమ్మ వారు శ్రీమహా గౌరీ అవతారంలో వెలుస్తారు. ఈ అవతారంలో గౌరమ్మను సుహాసినులు ముత్తైదువ తనాన్ని కాపాడమని అమ్మవారిని వేడుకుంటారు. ఈ సంవత్సరం నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజున కుమారి పూజ ( అమ్మవారిని బాలా రూపంగా) 9 సంవత్సరాల్లో పాపలను కుమారి పూజలు, తాంబూలాది వాయినాలు ఇస్తారు.
9వ రోజు
9 Siddhidatri
నవరాత్రుల తొమ్మిదో రోజు సోమవారం మహర్నవమి రోజున రాక్షసులపై అమ్మవారు అసుర సంహారిణిగా విజయాన్ని సాధించారు. ఈ విజయానికి గుర్తుగా తెల్లవారు దశమి రోజున ప్రజలు విజయ దశమి పండుగ నిర్వహిస్తారు.