బాన్సువాడ, మార్చి 4: గ్రామ సమన్వయ కమిటీ సభ్యులు అందరినీ కలుపుకొని గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలని సభాపతి పోచా రం శ్రీనివాసరెడ్డి సూచించారు. ఎవరికి వారే నియంతృత్వ పోకడలకు పోవొద్దని, ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో అబివృద్ధి పనులను జూన్ లోగా పూర్తి చేయాలని గడువు విధించారు. శనివారం ఆయన బాన్సువాడలోని తన నివాసంలో అన్ని గ్రామాల సమన్వయ కమిటీ సభ్యు లు, ప్రజా ప్రతినిధులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. సీఎం కేసీఆర్ దయతో బాన్సువాడ నియోజకవర్గానికి కావాల్సిన నిధులు మం జూరైనట్లు తెలిపారు.
బాన్సువాడ మండలంలో రూ.2 లక్షలలోపు ఉన్న నిధులతో 23 పనులకు గాను రూ.40 లక్షల నిధులు మంజూరు చేశారని తెలిపారు. రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు 119 పనులకు గాను రూ. 5.35 కోట్ల నిధులు మంజూరైనట్లు చెప్పారు. ఈ పనులకు టెండర్లు ఉండవన్నారు. రూ.10 లక్షల విలువ చేసే పనులు 65 ఉన్నాయని , వాటికి రూ.6.19 కోట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రూ.10 లక్షల పైబడి ఉన్న పనులు 37 ఉన్నాయని వాటికి రూ. 7.94 కోట్ల నిధులు మంజూరుచేశారని చెప్పారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఆపైన ఉన్న పనులకు ఇప్పటికే టెండర్ల కోసం నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. వెంటనే గ్రామాల్లో పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
డబుల్ రోడ్ల కోసం రూ.80 కోట్ల నిధులు
నియోజక వర్గంలో సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చేందుకు ఆర్అండ్బీ శాఖ ద్వారా రూ.80 కోట్ల నిధులు మంజూరైనట్లు స్పీకర్ తెలిపారు. అంకోల్ నుంచి హాజీపూర్ వరకు రూ.12 కోట్లు, దుర్కి నుంచి మిర్జాపూర్ మీదుగా బీర్కూర్ వరకు రూ.13 కోట్లు ,చందూరు నుంచి జలాల్పూర్ వరకు రూ.14 కోట్లు, కోటగిరి మండలంలోని పలు గ్రామాలకు నిధులు మంజూరైనట్లు వివరించారు. బాన్సువాడలో ఎస్సీ, బీసీ బాలికల పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాల కోసం ఒక్కో హాస్టల్‌కు రూ. 3 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఎస్ఆర్ఎన్కే సమీపంలో 2 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఎస్టీ బాలుర వసతి గృహం కోసం రూ.7 కోట్ల నిధులు మంజూరైనట్లు చెప్పారు. కోటగిరిలోని పది పడకల దవాఖానను 50 పడకలుగా మార్చేందుకు రూ.13 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. వర్నిలో 30 పడకల దవాఖాన శిథిలావస్థకు చేరడంతో అప్‌గ్రేడ్ చేయడానికి రూ.10 .70 కోట్ల నిధులు మంజూరైనట్లు చెప్పారు. తొమ్మిదేండ్ల కాలంలో నియోజక వర్గానికి సుమారు రూ.10 వేల కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు నిజాంసాగర్‌కు, మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ ద్వారా హల్దీవాగు వరకు, 24 కిలోమీటర్ల మేర గ్రావిటీ , దానిలో 18 కిలోమీటర్ల మేర సొరంగం నిర్మాణం కోసం రూ.1500 కోట్లు ఖర్చయినట్లు తెలిపారు. పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.
పీఆర్ ఈఈ సమత, డీఈ గోపీనాథ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, విండో చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, గంగుల గంగారాం, నాయకులు దొడ్ల వెంకట్రామ్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మహ్మద్ ఎజాస్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు పాత బాలకృష్ణ, పిట్ల శ్రీధర్, డీసీసీబీ డైరెక్టర్ సంగ్రాం నాయక్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్ పాల్గొన్నారు. అంతకుముందు స్పీకర్ బాన్సువాడ పట్టణం, రూరల్ గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం కింద ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అందజేశారు.