స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో శుక్రవారం రుద్రూర్ మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం ఆత్మీయత, అనురాగాలకు వేదికగా నిలిచింది. సుమారుగా ఐదు గంటల పాటు సాగిన ఈకార్యక్రమం ఆద్యాంతం ఉల్లాసభరితంగా జరిగింది. కోలాటం, బతుకమ్మ ఆటాపాటలతో పాటు జానపద కళారూపాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నది. సమ్మేళనానికి సతీమణితో కలిసి హాజరైన స్పీకర్ పార్టీ కార్యకర్తలతో మమేకమయ్యారు. వారి మంచిచెడులను, కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
నిజామాబాద్, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) / బోధన్ : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కుటుంబాల ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా జరుగుతున్నాయి. కార్యకర్తలు, వారి కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించడంతోపాటు వారి సాధకబాధకాల్లో పాలుపంచుకోవాలన్న పార్టీ నిర్ణయం మేరకు అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా బాన్సువాడ నియోజకవర్గంలో వినూత్నంగా ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రుద్రూర్ మండలం రాయకూర్‌లో పచ్చని పంట పొలాల మధ్య, మామిడి తోటలో కార్యక్రమాన్ని నిర్వహించారు. పోచారం శ్రీనివాస రెడ్డితోపాటు ఆయన సతీమణి పుష్ప, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి హాజరయ్యారు.
రుద్రూర్‌లోని 10 గ్రామాల పరిధిలోని కార్యకర్తలంతా కుటుంబాలతో సహా సమ్మేళనంలో భాగస్వామ్యం కావడంతో మామిడి తోట బీఆర్ఎస్మయమైంది. ఆత్మీయత, అనురాగాల కలబోతగా జరిగిన కార్యక్రమంలో స్పీకర్ నేరుగా వారి మంచిచెడులను, పార్టీ శ్రేణుల కుటుంబాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కోలాటం, బతుకమ్మ ఆటపాటలతోపాటు జానపద కళారూపాల ప్రదర్శన సైతం విశేషంగా ఆకట్టుకున్నది. మహిళా సర్పంచులు, కార్యకర్తల కుటుంబీకులు పెద్ద ఎత్తున సందడి వాతావరణంలో మునిగితేలారు. పలు రకాల వంటకాలతో కడుపు నిండా భోజనం పెట్టి కుటుంబ పండుగలా కార్యక్రమాన్ని నిర్వహించడంతో కార్యకర్తలంతా సంతోషం వ్యక్తం చేశారు. కార్యకర్తలు, కుటుంబసభ్యులంతా భోజనం చేసిన తర్వాత స్పీకర్ పోచారం భోజనం చేయడం గమనార్హం. అనంతరం మీడియాతో స్పీకర్ మాట్లాడారు.
త్వరలోనే లబ్ధిదారులతో సమ్మేళనాలు..
బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి నివేదికను ఆత్మీయ సమ్మేళనంలో స్పీకర్ వివరించారు. త్వరలోనే నియోజకవర్గ వ్యాప్తంగా అధికారికంగా ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారులతో సమ్మేళనాలు నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించారు. ఇందులో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్ రూం తదితర పథకాల ద్వా రా లబ్ధి పొందిన వారందరినీ మండలాల వారీగా కలుసుకుంటానని స్పీకర్ వెల్లడించారు. వారి సాధకబాధకాలను నేరుగా తెలుసుకొని ఇబ్బందులుంటే పరిష్కరిస్తామని వివరించారు. లబ్ధిదారులతో కూడిన వివరాలను ప్రతి గ్రామానికీ, మండల బాధ్యులకు పంపిస్తున్నట్లుగా వివరించారు. పథకాల వారీగా గ్రామాల్లో ఎవరెవరికి ప్రభుత్వ ప్రయోజనం దక్కుతున్నదో వివరాలను క్రోడీకరించినట్లుగా స్పీకర్ చెప్పా రు. ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
మా విజయాల వెనుక మహిళల శ్రమ
‘పొద్దున్న లేస్తే మా బీఆర్ఎస్ నాయకులు బయటికి రావాలి.. పార్టీ కార్యకలాపాలు, ప్రజాసేవలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇలా వారు చేసేందుకు, వారి విజయాలకు వారి వెనుక మహిళలే కారణం.. భార్యగా, తల్లిగా పొద్దున్నే లేచి ఇంట్లో పనులు చేసుకొని, మా నాయకులకు అన్ని సమకూర్చటంతోనే ఆ నాయకులు ప్రజాసేవలో నిమగ్నం కాగలుగుతున్నారు.’ ప్రతి నాయకుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని, తన విజయం వెనుక తన సతీమణి ఉందని ఆయన పేర్కొన్నారు.
‘బండి’ నీకు మానవత్వం ఉందా?
కేసీఆర్‌ను ఎదుర్కునే శక్తి, దమ్ము లేక, రాజకీయంగా పోటీ పడలేక బీజేపీ కుట్రలు చేస్తోందని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేకనే ఎస్సెస్సీ పరీక్షల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని దొంగలు, బ్రోకర్లను పురమాయించి లక్షలాది మంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీకు ఎవడిచ్చాడు ఈ హక్కు అంటూ ప్రశ్నించారు. రాజకీయం చేసే దమ్ముంటే ప్రజల ముందుకు రావాలన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడానికి పిల్లల జీవితాలతో చెలగాటం ఆడతావా? ఎస్సెస్సీ చదివే పిల్లలు ఏం పాపం చేశారని అన్నారు.
తెలుగు, హిందీ ప్రశ్నపత్రాల్లో లీకేజీలు ఏంటి.. మొన్ననేమో పబ్లిక్ కమిషన్‌లో నాటకం చేశారు. అంత చేసిన దొంగలు వీళ్లే. వీరిని త్వరలో ప్రజలే శిక్షిస్తారని, దుర్మార్గమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా చెప్పారు. లీకేజీ వ్యవహారమంతా కుట్రపూరితంగా ఉన్నదన్నారు. దొంగతనం చేసింది బండి సంజయ్ అని, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి సాక్ష్యాధారాలతో దొరికి ఎదురు మాట్లాడడానికి బుద్ధి ఉండాలన్నారు. దొంగతనం చేసిన దొంగనే ఎదుటి వారిని దొంగ ఉన్నట్లుగా బీజేపీ అధ్యక్షుడి తీరు ఉందని విమర్శించారు.
ప్రశ్నపత్రం లీకైతే బీజేపీ వాళ్లు సంతోషపడుతున్నారని, కానీ మేమంతా బాధపడుతున్నామంటూ ఆవేదన చెందారు. ఇది సహించరాని చర్య అన్నారు. బీజేపీకి తెలంగాణలో నలుగురు ఎంపీలుంటే ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ప్రత్యేక పథకాలు తెచ్చారా? నిధులు తెచ్చి అభివృద్ధి చేశారా? అని ప్రశ్నించారు. మేం చేసినవి చెప్పడానికి సవాలక్ష కార్యక్రమాలున్నాయంటూ సవాల్ విసిరారు. నేను ఇదంతా స్పీకర్ హోదాలో కాకుండా ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నానని వివరణ ఇచ్చారు. భగవంతుడు మనకు ఈ జన్మ ఇవ్వడమే గొప్పదని, ఈ జన్మను మంచి పనులతో సార్థకం చేసుకోవాలన్నారు. బీజేపీకి ప్రజలంతా కర్రు కాల్చి వాత పెడతారని తెలిపారు. దుర్మార్గపు రాజకీయం చేస్తే ప్రజలు మిమ్మల్ని బొంద పెడతారంటూ హెచ్చరించారు.
కోలాటం ఆడిన మహిళా ప్రజాప్రతినిధులు
రాయకూర్‌లో జరిగిన రుద్రూర్ మండల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీపీ చైర్మన్ అక్కపల్లి జాతానాగేందర్తోపాటు పలువురు మహిళా సర్పంచులు, సర్పంచుల సతీమణులు, మహిళా ప్రజాప్రతినిధులు కోలాటం ఆడి అలరించారు. బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆర్కెస్ట్రా విశేషంగా ఆకట్టుకున్నది. ఆట, పాటలతో మహిళలు సందడి చేశారు.
ముర్రుపాలు అమృతం..
మాతాశిశు సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషితోపాటు బాన్సువాడ దవాఖానలో అందిస్తున్న సేవలకు జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు. తనకు 75ఏళ్లలో ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే దానికి కారణం మా తల్లేనంటూ చెప్పారు. ముర్రుపాలు జీవితంలో ఒకేసారి దొరుకుతాయని తెలిపారు. తాను నాలుగేండ్ల వరకు అమ్మ పాలు తాగినట్లు చెప్పారు. అందుకే ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ మాతృమూర్తుల సంరక్షణకు కృషి చేస్తున్నారని తెలిపారు. డెలివరీ సమయంలో రక్తహీనత కనిపిస్తున్నదనే.. గర్భిణుల కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ను అందిస్తున్నట్లు చెప్పారు.
బాన్సువాడ అద్భుత ప్రగతి
బాన్సువాడ నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. 41,500 మందికి ఆసరా ఫించన్ల కింద సంవత్సరానికి రూ.144 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద 14 వేల మందికి రూ.123 కోట్లు ఇచ్చామన్నారు. రైతుబంధు కింద వెయ్యి కోట్లు, రైతుబీమా పథకం కింద 1500 మందికి రూ.75 కోట్ల ఆర్థిక సహాయం చేశామని వెల్లడించారు. 11 వేల డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించామని, ఇందుకు సుమారు వెయ్యి కోట్లు ఖర్చుచేశామన్నారు. రైతులకు వెయ్యి ట్రాక్టర్లను ఇచ్చామని, ఇందుకు సబ్సిడీని ప్రభుత్వం రూ.40 కోట్లు భరించిందన్నారు. కేసీఆర్ కిట్ల రూపంలో సుమారు రూ.500 కోట్లు ఖర్చుచేశామని, రెండు వేల కమ్యూనిటీ హాళ్లను నిర్మించామని, ఇందుకు రూ.400 కోట్లు ఖర్చుచేసినట్లు తెలిపారు.
బాన్సువాడ, జుక్కల్, బోధన్ నియోజకవర్గాలకు మిషన్ భగీరథ పథకం కోసం రూ.2,500 కోట్లు ఖర్చుచేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అక్కపల్లి సుజాతానాగేందర్, బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, జడ్పీటీసీ నారోజి గంగారాం, బోధన్ మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ సునీతాదేశాయ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సంగయ్య, వైస్ ఎంపీపీ ఎన్.సాయిలు, ఎంపీటీసీలు సావిత్రి, లక్ష్మి, పార్టీ నాయకులు పట్టెపు రాములు, సంజీవులు, పత్తి రాము, భాగ్య, సహకార సంఘాల అధ్యక్షులు సంజీవ్‌రెడ్డి, సంగమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
స్పీకర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం..
పోచారం శ్రీనివాస రెడ్డి గారితోనే నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. వారికి జీవితాంతం రుణపడి ఉంటాం. నా భార్య సునీతా దేశాయ్ బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ కావడానికి పోచారం సార్ కృషి ఎంతో ఉంది. అందరితో ఆత్మీయంగా ఉండే పోచారంలాంటి వ్యక్తిని కలిగి ఉండడం మన అదృష్టం. దేవుడు అడిగితేనే ఇస్తాడు.. కానీ, పోచారం అడగకపోయినా ఇస్తారు. అలాంటి నాయకుడు పదికాలాలపాటు మనకు ఉండాలని కోరుకుంటున్నాను.
– వెంకటేశ్వరరావు దేశాయ్ , బోధన్ ఏఎంసీ చైర్మన్