రుద్రూర్(వర్ని)/బాన్సువాడ రూరల్/బీర్కూర్, జులై 20 : వర్నిలోని ఎస్సీ బాలుర హాస్టల్లో నాణ్యమైన వంట సరుకులు వినియోగంచకపోవడంపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం సిద్ధం చేసిన వంటలులతోపాటు కూరగాయలు, పప్పుదినుసులను పరిశీలించారు. తాజాగా లేవంటూ అసహనం వ్యక్తంచేశారు. వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై ప్రశ్నించారు. వెంటనే కలెక్టర్ నారాయణరెడ్డితో ఫోన్లో మాట్లాడి వార్డెన్, అటెండర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా..లేదా? అని అడిగి తెలుసుకున్నారు.
సీసీ రోడ్డు పనుల పరిశీలన
బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు నుంచి ఆర్అండ్బీ రోడ్డు వరకు రూ. 65లక్షల నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ బోర్లం క్యాంపు ఇరిగేషన్ పరిధిలో ఉన్నదని, 1930లో అధికారుల సౌలభ్యం కోసం బీటీ రోడ్డు వేశారని గుర్తుచేశారు. రెండు గ్రామాల సౌకర్యార్థం నిధులు మంజూరు చేసి ప్రస్తుతం సీసీ రోడ్డు నిర్మిస్తున్నామని చెప్పారు. రోడ్లపై కేజ్‌వీల్ ట్రాక్టర్లను తిప్పితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణను సీఎం కేసీఆర్ నంబర్‌వన్ స్థానంలో నిలిపారని కొనియాడారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీవో రాజాగౌడ్, నీటిపారుదల శాఖ ఎస్ఈ వసంత, ఈఈ రమణ, డీఈ జగదీశ్, సర్పంచులు సరళ, నాన్కుబాయి, సొసైటీల చైర్మన్లు కృష్ణారెడ్డి, శ్రీధర్, నాయకులు ఉన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
పలు బాధిత కుటుంబాలను స్పీకర్ పోచారం పరామర్శించారు. బాన్సువాడ మండలం తిర్మలాపూర్‌లో పిడుగు పాటుతో మృతిచెందిన శివాని, హత్యకు గురైన బాలరాజు కుటుంబ సభ్యులతో మాట్లాడి బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట సర్పంచ్ జిన్న రఘురామయ్య, నాయకులు ఉన్నారు. వర్ని మండలం తగిలేపల్లిలో ఇల్లు కూలి ఇటీవల మృతిచెందిన రాజమణి, గతంలో మృతిచెందిన తల్లీ కూతురు కుటుంబసభ్యులతో మాట్లాడారు. రాజమణి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ మండల కార్యదర్శి గోపాల్, సర్పంచ్ వెంకన్న పాల్గొన్నారు.
షాదీముబారక్ చెక్కు అందజేత..
బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన ఒకరికి మంజూరైన షాదీముబారక్ చెక్కును స్పీకర్ శ్రీనివాసరెడ్డి తన స్వగృహంలో అందజేశారు. ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ గంగాధర్, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రాంరెడ్డి రెడ్డి, సర్పంచ్ నారాయణరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.