వర్ని, జనవరి 29: ఆకుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పసికందుకు జన్మినిచ్చి ఓ తల్లి తనువు చాలించింది. దీంతో ఇద్దరు చిన్నారులకు తల్లి లేకుండా పోవడంతో కుటుంబ సభ్యులందరూ దుఃఖ సాగరంలో మునిగిపోయారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఏదో విషాదం చోటుచేసుకుందన్న విషయాన్ని గమనించి, తన అనుచరుల ద్వారా పూర్తివివరాలు తెలుసుకొన్నారు. వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. ఈ ఘటన వర్ని మండల కేంద్రంలోని రజా కాలనీలో ఆదివారం చోటుచేసుకున్నది. కాలనీకి చెందిన ఖాసీం కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన భార్య ఫౌజియా పర్వీన్ ప్రసూతి సమయంలో మరో బిడ్డకు జన్మనిచ్చి మృతిచెందింది. దీంతో ఇద్దరు చిన్నారులు తల్లి లేని వారయ్యారు. విషయం తెలుసుకున్న సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
కుటుంబ అవసరాల నిమిత్తం రూ. 50వేల ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. ఖాసీం రేకుల ఇంట్లో నివాసముంటున్న విషయాన్ని గమనించిన స్పీకర్ డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తన వద్ద డబ్బు లేని కారణంగా గతంలో మంజూరైన డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టుకోలేకపోయానని ఖాసీం .. స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాడు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డికి చెప్పి ఇల్లు నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు.
మృతురాలి తల్లి తండ్రులు కూడా నిరుపేద కుటుంబానికి చెందిన వారనే విషయాన్ని తెలుసుకున్న స్పీకర్.. వారి స్వగ్రామం రుద్రూరులో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తల్లిని కోల్పోయిన చిన్నారులను పెంచి ఉన్నతులుగా తీర్చి దిద్దాలని ఈ సందర్భంగా చిన్నారుల తండ్రి, నానమ్మ, అమ్మమ్మతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు సూచించారు. నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న స్పీకర్‌కు బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.