బోధన్ రూరల్, జూన్ 23: డబ్బుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ ఘటన బోధన్ మండలం పెంటకుర్దూ గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గైక్వాడ్ చంద్రకళ(59)కు కొన్నేండ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన వ్యక్తితో పెండ్లి చేశారు. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉండగా వారందరికీ పెండ్లిలు అయ్యాయి.
మహారాష్ట్రలో నివాసం ఉంటున్న చంద్రకళ కొన్ని సంవత్సరాల క్రితం పెంటకుర్దూ గ్రామానికి వచ్చి ఉంటున్నది. అప్పుడప్పడు చిన్న కొడుకు సురేశ్ తల్లివద్దకు వచ్చిపోతుండేవాడు. ఆదివారం రాత్రి డబ్బుల కోసం తల్లిపై గొడ్డలితో దాడి చేసి హత మార్చాడు. విషయం తెలుసుకున్న బోధన్ రూరల్ ఎస్సై మశ్చేందర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కొడుకే నరికి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.