నిజామాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఫైనాన్షియర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. వారి వేధింపులు తాళలేక కుటుంబాలే బలవుతున్నాయి. పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా అసభ్య పదజాలంతో పరువు తీసే విధంగా మాట్లాడడంతో అనమానభారం భరించలేక నిజామాబాద్ నగరానికి చెందిన ఓ కుటుంబం గోదావరి నదిలో బుధవారం దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతుకాగా.. ఒక మహిళను స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. నగరంలోని న్యాల్కల్ రోడ్డులో నివాసించే వేణు, భార్య అనురాధ, కూతురు పూర్ణిమతో కలిసి గోదావరిలో దూకగా అనురాధను స్థానికులు రక్షించగా.. మరో ఇద్దరి ఆచూకీ లభించలేదు.
2022, జనవరి 10న అచ్చంగా ఇలాంటి ఘటనే జరిగింది. పప్పుల సురేశ్ అనే వ్యాపారి కుటుంబం కూడా ఫైనాన్షియర్ల వేధింపులకు బలి కావాల్సి వచ్చింది. వీడియో, ఆడియో రికార్డులను బయట పెట్టిన సురేశ్.. బీజేపీ నేత గణేశ్ వేధింపులను ప్రస్తావించి కృష్ణానదిలో దూకి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బుధవారం వెలుగు చూసిన ఆత్మహత్యాయత్నం ఘటనలోనూ నిందితులకు బీజేపీతో దగ్గరి సంబంధాలున్నట్లుగా తెలుస్తున్నది. ప్రాణాలతో బయటపడిన అనురాధ.. ఓ గుట్కా ఏజెన్సీ పేరును చెప్పడంతో సదరు వ్యక్తి బీజేపీలోనే ఉన్నట్లు తెలిస్తున్నది. రెండున్నరేండ్ల కాలంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఓ రెండు కుటుంబాలకు చెందిన మొత్తం ఆరుగురి చావుకు ఫైనాన్షియర్ల రాక్షసత్వం కారణం కావడం, వారందరూ ఒకే పార్టీకి చెందిన వారు కావడంచర్చనీయాంశం అవుతున్నది.
ఫైనాన్షియర్లదే రాజ్యం..
కాంగ్రెస్ అధికారం చేపట్టిన అనంతరం పలుసార్లు మైక్రో ఫైనాన్షియర్ల ఇండ్లు, వ్యాపార స్థావరాలపై పోలీసులు దాడిచేశారు. అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. తనిఖీలు నిర్వహించిన పోలీసులే ఇప్పుడు అక్రమార్కులకు అండదండగా నిలవడం విడ్డూరంగా మారింది. రాజకీయ నాయకుల అండదండలతో ఫైనాన్స్ దందాను నడుపుతున్న వారి జోలికి పోలీసులు వెళ్లకుండా.. కేవలం సామాన్యుల ఇండ్లపై దాడి చేసి మమ అనిపించారు. నామమాత్రపు దాడులతోనే నేడు మరో కుటుంబం బలికావాల్సిన దుస్థితి ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫైనాన్షియర్ల ఆగడాలను నియంత్రించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రుణగ్రహీతలను వేధించొద్దని పోలీసులు చేసిన హెచ్చరికలన్నీ ఉట్టిమాటలే అని వేణు కుటుంబం ఆత్మహత్యాయత్నంతో తేలిపోయిందని వారి బంధువులు అంటున్నారు. అధికార మదం, కీలక నేతల అండదండలతోనే ఫైనాన్షియర్లు ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారని, వీరికి పోలీసులే వత్తాసు పలుకుతున్నారని చెబుతున్నారు.
నాడు కృష్ణా.. నేడు గోదావరి..
సరిగ్గా రెండున్నరేండ్ల క్రితం కూడా ఇలాంటి అమానవీయ ఘటనే వెలుగు చూసింది. నిజామాబాద్ నగరానికి చెందిన వ్యాపారి పప్పుల సురేశ్ కుటుంబం కూడా ఫైనాన్షియర్ల తీరుకు బలి కావాల్సి వచ్చింది. వారి వేధింపులు తాళలేక విజయవాడ కనకదుర్గమ్మ వద్దకు వెళ్లి కృష్ణా నదిలో దూకి బలవన్మరణం చేసుకున్నారు. నాటి కేసులోనూ బీజేపీ నాయకుడే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటన జరిగిన అనంతరం సదరు నాయకుడిని బీజేపీ సస్పెండ్ చేసింది. పూటకో విధంగా నీతులు మాట్లాడే ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాకు వారి అనుచరులు చేస్తున్న ఆగడాలు కండ్లకు కనిపించడం లేదా? అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. తమ శ్రేణులను సన్మార్గంలో నడిపించాల్సిన నేతలే వంకర పలుకులతో గతి తప్పిన నేపథ్యంలో కింది స్థాయిలో మార్పు కోరుకోవడం అసాధ్యమనే మాటలు వినిపిస్తున్నాయి. అప్పట్లో సురేశ్ కుటుంబంలోని నలుగురిని బీజేపీ నాయకుడు బలి గొనగా, ఇప్పుడు కూడా అదే పార్టీకి చెందిన నేతల ఒత్తిడి మూలంగా వేణు కుటుంబంలోని ఇద్దరు తనువు చాలించాల్సి రావడం బాధాకరంగా మారింది.