మంచి దిగుబడి వచ్చిందన్న ఆశతో కొనుగోలు కేంద్రాలకు పంటతో వచ్చిన రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను తీసుకొచ్చి ఇరవై రోజులవుతున్నా కాంటా చేయకపోవడంతో అకాల వర్షానికి తడిసి మొలకలు వస్తున్నాయి. కొనుగోళ్లలో ఆలస్యం.. తడిసిన ధాన్యానికి మొలకలు వస్తుండడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, బీబీపేట, కామారెడ్డి రూరల్ తదితర మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఒక్కో సొసైటీలో వందలాది వడ్ల కుప్పలు అలాగే ఉన్నాయి.
లారీల లోడింగ్, అన్లోడింగ్ సమస్యను పరిష్కరించే నాథుడు లేకపోవడంతో రోజుల తరబడి కొనుగోలు కేంద్రాలను దాటడం లేదు. ధాన్యం తీసుకొచ్చి దాదాపు 20 రోజులవుతున్నా కాంటా చేయకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మళ్లీ వర్షం వస్తే తమ పరిస్థితి ఏమిటో తెలియక రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే ధాన్యం కుప్పలతోపాటు బస్తాలకు కూడా మొలకలు రావడంతో వాటిని ఆరబెట్టేందుకు ఆపసోపాలు పడుతున్నారు.
– బీబీపేట, మే 19
కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చి 20 రోజులవుతున్నది. లారీలు రాకపోవడంతోనే కాంటా వేయడం లేదని సొసైటీ సిబ్బంది చెబుతున్నా రు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి. వర్షం ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. వడ్లు తడిసి మొలకెత్తుతున్నాయి. ఇట్ల అయితే రైతులు ఎలా బతకాలి.
– పి.రాములు, రైతు, బీబీపేట్
నేను మూడెకరాల్లో వరి సాగు చేసిన. కోత కోసి గత నెల 30వ తేదీన వడ్లను కేంద్రానికి తీసుకొచ్చిన. ఇప్పటి వరకు కాంటా పెట్టలేరు. అకాల వర్షాలతో వడ్లన్నీ తడిసి మొలకెత్తుతున్నాయి. గతంలో ఉన్న ప్రభుత్వం వడ్లను తొందరగా కొన్నది. ఇప్పటి సర్కారు కొనుగోళ్లను పట్టించుకుంట లేదు. అధికారులు, ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయాలి.
– పాత పెంటయ్య, రైతు, జనగామ
నా భర్త యాక్సిడెంట్లో చనిపోయిండు. నా ఇద్దరు కూతుళ్ల సాయంతో మూడు ఎకరాల్లో వరి పండించిన. వడ్లు తెచ్చి 15 రోజులవుతున్నది. ఇప్పటి వరకు కాంటా చేయలేదు. మొన్న పడ్డ వర్షానికి వడ్లు తడిసి మొలకలు వస్తున్నయ్. సొసైటీ వాళ్లు తెలిసిన వారికే తొందరగా కాంటా చేస్తున్నరు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.
– జంగిటి పద్మ, మహిళా రైతు, బీబీపేట్
రైస్‌మిల్లుల్లో అన్లోడ్ చేయకపోవడంతోనే ఇబ్బందులొస్తున్నాయి. లారీలు వస్తే మా సొసైటీ పరిధిలో 15 రోజుల్లో కొనుగోళ్లు పూర్తిచేస్తాం. ఇప్పటి వరకు సొసైటీ పరిధిలో 2161 మంది రైతుల నుంచి 2,31,304 బస్తాలు (92,521. 60 క్వింటాళ్లు) ధాన్యం కాంటా వేసి రైస్‌మిల్లుకు తరలించాం. ఇం కా 1103(కుప్పలు),లక్షా 55వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నది.
-నర్సాగౌడ్, సీఈవో, బీబీపేట్ సొసైటీ
నేను నాలుగు ఎకరాల్లో వరి పండించిన. వడ్లను 18 రోజుల కిందట కేంద్రానికి తీసుకొచ్చిన. ఇక్కడి సొసైటీ సిబ్బంది నిర్లక్ష్యంతో కాంటా చేయక నిన్న, మొన్న పడ్డ వర్షానికి వడ్లన్ని తడిసి పోయాయి. దీంతో మళ్లీ ఆరబెడుతున్నాం. తడిసిన వడ్లకు మొలకలు వస్తున్నాయి. కాంటా తొందరగా పెట్టి.. బస్తాలను తరలిస్తే మాకు ఏ ఇబ్బందీ ఉండదు.
– సత్తవ్వ, మహిళారైతు, బీబీపేట్