స్నేహం ముసుగులో వచ్చిన మృత్యువును గుర్తించలేని ఓ స్నేహితుడు తనతోపాటు తన కుటుంబాన్ని కోల్పోయాడు. జల్సాల కోసం స్నేహమనే పదానికే కళంకం తెచ్చే విధంగా నమ్మిన మిత్రుడి కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నాడో కిరాతకుడు. ఆస్తి కోసం రెండు వారాల వ్యవధిలోనే ఒక్కొక్కరినీ కిరాతంకంగా చంపేశాడు. చిన్న పిల్లలు, దివ్యాంగురాలు అని చూడకుండా హతమార్చాడు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురయ్యారన్న వార్తతో ఉమ్మడి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మాక్లూర్‌కు చెందిన ప్రశాంత్.. స్నేహితుడైన ప్రసాద్‌కు రుణం ఇప్పిస్తానని నమ్మబలికి తన పేరుపై రాయించుకొన్న ఒక ఇంటిని అమ్మేశాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రసాద్.. ప్రశాంత్‌ను నిలదీయడంతో ప్రసాద్‌తో పాటు హక్కు దారులు ఎవరూ లేకుండా కుటుంబం మొత్తాన్ని అంతమొందించాలని పథకం పన్నాడు. 15 రోజుల వ్యవధిలోనే ప్రసాద్, రమణి (భార్య),చయిత్ (కుమారుడు) , చైత్ర (కూతురు), ఇద్దరు చెల్లెళ్లు స్వప్న(దివ్యాంగురాలు), స్రవంతిని ప్రశాంత్ హత్య చేశాడు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామ శివారులో ఈ నెల 14న దివ్యాంగురాలైన యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించి కూపీ లాగడంతో అసలు విషయం బయటపడింది. ప్రశాంత్ వ్యవహారంపై లోతుగా విచారిస్తే మరికొన్ని ఉదంతాలు వెలుగు చూసే అవకాశం లేకపోలేదని మాక్లూర్ వాసులు పేర్కొంటున్నారు. ప్రశాంత్‌తో పాటు మరో ముగ్గురు సైతం హత్యల్లో పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
నిజామాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / మాక్లూర్ : ఒకే కుటుంబంలో ఆరుగురిని అతి దారుణంగా చంపేసాడో కిరాతకుడు. 25 ఏండ్లు కూడా నిండని ప్రబుద్ధుడు అణ్యం పుణ్యం తెలియని పిల్లలను సైతం పొట్టన పెట్టుకున్నాడు. చిన్నారులకు బండరాళ్లు కట్టి నీళ్లలోకి విసిరేశాడు. ఏ పాపం తెలియని దివ్యాంగురాలిని కర్కషంగా పెట్రోల్ పోసి అంతమొందించాడు. కుటిల స్నేహం చేసి ముగ్గులోకి దించి, ఆస్తిని కాజేసేందుకు నడిపించిన తతంగంలో హంతకుడి తీరు ఒళ్లు గగుర్పొడిచే విధంగా కనిపిస్తుండడం చర్చనీయాంశం అవుతున్నది. సగం కాలిన ఓ మృతదేహంతో నిందితుడి గుట్టు రట్టు కాగా, ఆరుగురి హత్య విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. చనిపోయిన వారిలో స్రవంతి మూడు నెలల క్రితమే మెట్టినింటి నుంచి తన సోదరుడు ప్రసాద్ చెంతకు వచ్చి కనిపించకుండా పోవడం దయనీయంగా మారింది. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా మరో ముగ్గురి ఆచూకీ లేకుండా పోయింది. కిరాతక ప్రశాంత్.. తన క్రిమినల్ మైండ్‌తో ఎవరికీ అనుమానం రాకుండా అంతమొందించాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి ప్రాణాలు తీశాడు. డిసెంబర్ 13న యువతి హత్య కేసు కూపీ లాగి పోలీసులు హంతకుడి బండారం బయటకు తీశారు.
పోలీసులు, మాక్లూర్ గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ప్రశాంత్, హత్యకు గురైన రాచర్లకూన ప్రసాద్ కుటుంబానిది నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రం. ప్రసాద్ అనే వ్యక్తి ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి రెండేండ్ల క్రితం సొంతూరికి తిరిగొచ్చాడు. గల్ఫ్‌లో ఉన్నప్పుడే ప్రసాద్ మూలంగా మోసపోయిన ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటనతో ప్రసాద్ కుటుంబం ఇల్లు వదిలి వేరే గ్రామంలో స్థిరపడింది. ప్రసాద్ తన పేరిట ఉన్న ఎకరం భూమిని యువతి కుటుంబానికి రాసిచ్చి ఈ వ్యవహారాన్ని ముగించుకున్నాడు. ఓ అమాయక యువతి ప్రాణాలను బలిగొన్న కారణంగా గ్రామంలో ప్రసాద్ కుటుంబంతో ఎవ్వరూ సత్సంబంధాలు పెట్టుకోకపోవడంతో కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి వెళ్లి తన కుటుంబంతో ప్రసాద్ బతుకుతున్నాడు. తన బతుకు తాను బతుకున్న సమయంలో స్వగ్రామం మాక్లూర్‌కు చెందిన ప్రశాంత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కుటుంబ పోషణకు అప్పు కోసం చూస్తున్న సమయంలో ప్రసాద్‌కు ప్రశాంత్ దగ్గరయ్యాడు. యువతి మృతి కేసులో నిందితుడిగా ఉన్నందున ఆస్తి బదలాయింపు కష్టం అవుతుందని చెప్పి తన పేరిట ఆస్తులు రాసిస్తే లోన్ ఇప్పిస్తానంటూ ప్రసాద్‌ను ప్రశాంత్ నమ్మబలికాడు. ఇదంతా నిజమేనని నమ్మి తన రెండు ఇండ్లను, ఒక ఫ్లాట్‌ను రాసిచ్చాడు. కొద్ది రోజులకు ప్రసాద్‌కు చెందిన ఒక ఇంటిని చెప్పా పెట్టకుండా వేరే వ్యక్తికి ప్రశాంత్ విక్రయించాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలియడంతో ప్రశాంత్‌ను ప్రసాద్ నిలదీశాడు. ఇరువురు మధ్య కొద్ది కాలంలోనే మొదలైన స్నేహం కాస్తా తీవ్ర వైరంగా మారింది. ఇల్లు విక్రయానికి సంబంధించిన డబ్బును ఇవ్వాలని డిమాండ్ చేయడంతో తనకు రాజకీయ ప్రాబల్యం ఉందంటూ ప్రశాంత్ బెదిరింపులకు దిగాడు. వారం, పది రోజులుగా ఇరువురి మధ్య జరుగుతున్న జగడం ముదరడంతో ప్రసాద్‌ను, ఆయన కుటుంబాన్ని మట్టుబెట్టాలని ప్రశాంత్ నిర్ణయించుకున్నాడు. స్థిరాస్తికి సంబంధించి హక్కుదారులెవ్వ రూ ఉండకూడదని భావించి కుటుంబం మొత్తాన్ని మట్టుబెట్టాలని నిర్ణయానికి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురి కావడంతో ఒక్కసారిగా మాక్లూర్ గ్రామం ఉలిక్కిపడింది. ప్రతి ఒక్కరూ ప్రసాద్ కుటుంబం మరణ వార్తను తెలుసుకుని నివ్వెర పోయారు. స్వగ్రామానికే చెందిన ప్రశాంత్ చేతిలో అన్యాయంగా హత్యకు గురైన ఘటనను తలచుకుని చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. సీరియల్ కిల్లర్ ప్రశాంత్‌కు 25 ఏండ్లే అయినప్పటికీ గ్రామంలో అనేక మందిని భూ లావాదేవీల విషయంలో మోసగించాడు. అమాయకులను బుట్టలో వేసుకుని వారి పేరిట ఉన్న విలువైన భూమిని తన పేరు మీదకు బదలాయించుకుని, చాలా కాలంగా మోసాలకు పాల్పడ్డా డు. తీరా విషయం తెలుసుకుని ఎవరైనా నిలదీస్తే రాజకీయ నాయకుల పేరుతో బెదిరింపులకు పాల్పడడం మూలంగా ప్రజలంతా వెనకడుగు వేయాల్సి వచ్చింది. కిరాతకుడు ప్రశాంత్ చేతిలో ప్రసాద్ కుటుంబం బలి కావడంతో ఒక్కొక్కరుగా ప్రశాంత్ బాధితులు ముందుకు వచ్చి తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. గ్రామానికి చెందిన వారిని కిరాతకంగా హత్య చేసిన ప్రశాంత్ గతంలోనూ ఇలాంటి ఘటనలు చేసి ఉంటాడా? అన్న అనుమానాలు సైతం బలంగా వినిపిస్తున్నాయి. సాదాసీదా కుటుంబానికి చెందిన ప్రశాంత్.. అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకోవాలని తహతహలాడుతుండే వాడని గ్రామస్తులు చెప్పారు. మూడేండ్ల క్రితం కనీసం సైకిల్ కూడా లేని వ్యక్తికి కొత్త కార్లు రావడంతో అంతా అవాక్కయ్యారు. ఇందులో భాగంగానే సులువుగా డబ్బులు సంపాదించేందుకు ఈ మోసాలకు పాల్పడి, తద్వారా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తూ, కొత్త వాహనాలతో హల్చల్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. పూటకో వాహనాన్ని మార్చుకుంటూ జనాన్ని బుట్టలో వేసుకుని మోసాలు చేస్తుండగా అనేకసార్లు చివాట్లు తిన్నాడు. గ్రామంలో అసలు రంగు బట్టబయలు కావడంతో ప్రశాంత్ ఏమీ చేయలేక ఊరు వదిలి వెళ్లిన ప్రసాద్ కుటుంబాన్ని ఎంచుకుని హత్యలకు పాల్పడి తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు. ప్రశాంత్ వ్యవహారంపై లోతుగా విచారిస్తే మరికొన్ని ఉదంతాలు వెలుగు చూసే అవకాశం లేకపోలేదని మాక్లూర్ వాసులు పేర్కొంటున్నారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి 44కు ఐదు కిలో మీటర్ల దూరంలో డిసెంబర్ 14న హత్యకు గురైన దివ్యాంగురాలైన ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. లైంగిక దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. చుట్టుపక్కల సీసీటీవీలను పరిశీలించగా ఒక అనుమానాస్పద కారును గుర్తించారు. ఈ కారు నంబర్‌తోపాటు సెల్‌ఫోన్ సిగ్నల్ డాటాను విశ్లేషించగా మాక్లూర్ మండలంలోని ప్రశాంత్ అనే యువకుడికి సంబంధించిన ఆనవాళ్లు బహిర్గతం అయ్యాయి. సదరు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నివ్వెరపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. నిందితుడు చెప్పిన వివరాల మేరకు డిచ్పల్లి హైవే పక్కన రాచర్లకూన ప్రసాద్‌ను మొదటగా హత్య చేసి పూడ్చిపెట్టాడు. ప్రసాద్ భార్య రమణిని బాసర వద్ద గోదావరిలో పదేశాడు. వీరి ఇద్దరు పిల్లలు చైత్, చైత్రను చంపి పోచంపాడ్ సోన్ బ్రిడ్జి వద్ద గోదావరిలో తోసేశాడు. అనంతరం ప్రసాద్, అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారని నమ్మబలికి.. ప్రసాద్ ఇద్దరి చెల్లెళ్లు స్వప్న(దివ్యాంగురాలు), స్రవంతిలను వేర్వేరుగా హంతకులు చంపేశారు. ఇందులో స్వప్న మృతదేహం భూంపల్లి శివారులో దొరకడంతోనే ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. వరుసగా మొదటి మూడు హత్యలను ప్రశాంత్ ఒక్కడే చేసినట్లుగా తెలుస్తోంది. మిగిలిన హత్యలను ప్రశాంత్ సన్నిహితులైన మైనర్లు చేసినట్లుగా సమాచారం. హంతకులను కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
మెండోరా, డిసెంబర్ 18 : జిల్లావ్యాప్తంగా సంచలనం రేపిన ఆరుగురి హత్య కేసులో మరో మృతదేహం మెండోరా మండలంలోని జిల్లా సరిహద్దు అయిన సోన్ బ్రిడ్జి వద్ద గోదావరి నదిలో సోమవారం లభ్యమయ్యింది. ఈ నెల 8న చయిత్ర మృతదేహాన్ని గుర్తించారు. పది రోజుల అనంతరం చయిత్ మృతదేహం లభ్యమైంది. దీంతో స్థానిక పోలీసులు, ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో క్లూస్ టీం, వైద్యసిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలుడి మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితిలో లభ్యమైందన్నారు. దీంతో మృతదేహాన్ని అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.