కామారెడ్డి, జూన్ 4: కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో లొల్లి మరింత ముదిరింది. స్థానిక నేతల పంచాయితీ గాంధీభవన్‌కు చేరింది. తాజాగా మాజీ మంత్రి షబ్బీర్ అలీపై వైరి వర్గం క్రమశిక్షణ చర్యల కమిటీ (డీఏసీ)కి ఫిర్యాదు చేసింది. అదే సమయంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డికి క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ పరిణామాలు ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. కామారెడ్డి జిల్లాలో అధికార పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.
ఇరువర్గాల నేతలు పార్టీ నాయకత్వానికి పరస్పర ఫిర్యాదులు చేసుకుంటుండడం రసవత్తరంగా మారింది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిపై మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వర్గానికి చెందిన వారు ఇటీవల పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్‌రెడ్డి వర్గం వారు సైతం గురువారం షబ్బీర్ అలీపై పలు ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. షబ్బీర్ అలీపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి వినతిపత్రం సమర్పించారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాకుండా షబ్బీర్ అలీ అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి గెలుపు కోసం షబ్బీర్ అలీ వర్గం ఏమాత్రం పని చేయాలేదన్నారు.
షబ్బీర్ అలీకి 9 సార్లు బీఫాం ఇస్తే, రెండుసార్లు మాత్రమే గెలిచారని గుర్తు చేశారు. షబ్బీర్ అలీ తమ్ముడు నహీం అరాచకాలు అంతా ఇంతా కాదని, ఏ అధికారికి పోస్టింగ్ కావాలన్నా అతడ్ని సంప్రదించాల్సిందేనని చంద్రశేఖర్‌రెడ్డి వర్గీయులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కామారెడ్డిలో మరో వర్గం ఎదగకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వకుండా, స్వతంత్య్ర అభ్యర్థిగా గెలుపొందిన కౌన్సిలర్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్‌తో షబ్బీర్ అలీ రూ.4 కోట్లు డీల్ చేసుకొని చైర్పర్సన్ పదవి ఇప్పించారనే విమర్శలు ఉన్నాయని తెలిపారు. షబ్బీర్ అలీ వర్గీయుల ఆగడాలను ఆపాలని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఇందుప్రియ, మామిళ్ళ అంజన్న, నిమ్మ విజయ్‌కుమార్‌రెడ్డి, పంపిరి లక్ష్మణ్ కోరారు.
కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యల కమిటీ (డీఏసీ).. జిల్లాకు చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ మేరకు డీఏసీ చైర్మన్ మల్లు రవి, ఉపాధ్యక్షుడు శ్యామ్ మోహన్ పేరిట నోటీసులు జారీ అయ్యాయి.
కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలకు సంబంధించి పత్రికా కథనాలు, పేలుడు పదార్థాలకు సంబంధించిన కేసు, మున్సిపాలిటీలోని పాత సామాను అమ్మకం, భూ కబ్జాలపై కేసు అలాగే అతనిపై 13 ఎఫ్ఐఆర్లు, 420 కేసుల ఆధారాలతో సహా వచ్చిన ఆరోపణలపై కమిటీకి వచ్చిన ఫిర్యాదుల మేరకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
అలాగే, పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించాయనే ఆరోపణలు కూడా నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి 7 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణను అందించాలని చంద్రశేఖర్‌రెడ్డిని ఆదేశించారు. వివరణ అందిన అనంతరం పార్టీ నియమ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలపై కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని వెల్లడించారు.