‘పాటలో తేటగా పరిమళించిన భాష తెలుగని తలయెత్తి పలికినావు రసరాగ రవళిగా రాణకెక్కినదని రమ్యోక్తి సుశ్రాలు రాల్చినావు
ఆంధ్ర సంస్కృతిలోని అందచందాలకు చేయెత్తి భాష్యమ్ము చెప్పినావు భువనాలు కవనాలు పొంది నీ కవనాలు మెచ్చగా వినిపించి మించినావు ఖండాఖండాంతరమ్ముల ఖండ మధుర భావ భావ్యములగు దాక పాడినావు నేడు పల్లవించె నినుగని నిలువెల్ల సదయహృదయ! కర్పూర వసంతరాయ!
మహా వైభవోన్నతికి రెడ్డి రాజులు ప్రతీక. కవి, పండిత పోషకుడు కర్పూర వసంతరాయల బిరుదాంకితుడైన కొమరగిరిరెడ్డి జీవిత ఘట్టాలను రసవత్తరంగా చిత్రించిన సినారెను ‘కర్పూర వసంతరాయలు’ అంటూ ఎల్లూరి శివారెడ్డి ప్రశంసించారు.
సినారె గేయకావ్యాల్లో నాగార్జునసాగరం, కర్పూర వసంతరాయలు, రుతుచక్రం, విశ్వనాథ నాయుడు, స్వప్నభంగం, విశ్వగీతి విభిన్న రూపాలను మేళవించి ఎంతో చక్కగా చిత్రించారు.నాగార్జునసాగరం (రక్తికి-విరక్తికి), రుతుచక్రం (స్వీయానుభవ ప్రణయం), విశ్వనాథనాయుడు (ధీర గంభీరత), స్వప్నభంగం (విరహ వేదన) వంటి పాత్రోచిత రసాలను మేళవించి తన రసహృదయాన్ని చాటారు. తన కావ్యాల్లో రసికత రంగరించినా చివరగా సందేశాన్నిచ్చి విశ్వమానవ కళ్యాణాన్ని కోరుకుని ‘విశ్వకవి’గా చరిత్రలో నిలిచిపోయారు.
నాగార్జునసాగరం (కావ్యం) విరక్తియను మోక్ష రహస్యమునకును, రక్తియను బంధ రహస్యమునకును గల అనాది స్పర్థ. అది అనంతం కూడా. ఇందలి కథాబీజము బౌద్ధమత ప్రచారం ప్రపంచమందంతా జయశీలముగా సాగుచుండిన కాలమది. నాగార్జునగిరి యందలి మహాచైత్యము శిల్పారామముగా నిర్మింపబడుచున్న వాళ్లవి. శిల్ప సృష్టికై మతాచార్యునిచే నియుక్తుడైన పద్మదేవుడు ఈ కథానాయకుడు తరుణుడు. సుందరుడు. గానమూ, చిత్రకర్మ, విగ్రహ రచన అను మూడు కళలయందును సిద్ధహస్తుడైన సహృదయుడు. ‘ఆంధ్రుడతడు’ అని రెడ్డి గారు ఊహించారని రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ అభిప్రాయపడ్డారు. పద్మదేవుడిని ‘విశ్వాత్మజుండు’ అని కవి ప్రశంసలో విశ్వమానవత కనిపిస్తుంది.
‘అతనికి ప్రాంతపుటెల్లలు
అక్షి గోచరములు కావు
అతనికి మతవైషమ్యము
అణుమాత్రము తెలియరావు
అతని హృదయ మనల్పమ్ము
అతడు సజీవ శిల్పమ్ము
అతడు మానవుని రూపము
నందిగొన్న గాంధర్వము
కఠిన శిలల నవనీతము
గా మార్చెడు తాంత్రికుండు
విషదరముల తలలూపెడు
రసవత్తర మాంత్రికుండు
అతని తనువు సుందరమ్ము
అతని మనసు సుందరమ్ము
అతనికి కన్పించున ప్ర
త్యణువున నొకసురపురమ్ము’
బౌద్ధమతం, మతాల్లోని మానవుని ఇహపర సుఖాలకు స్త్రీ, పురుషుల ప్రణయానికి అడ్డుగోడలు కారాదు. మత నియమాలు, మత నిష్టలు ఎందుకనే స్వేచ్ఛాప్రియుడు, కళాన్వితుడు, చిత్రకారుడు పద్మదేవుడు. కథానాయిక శాంతిశ్రీ సంఘారామమున ఆచార్యుని వద్ద బౌద్ధ సిద్ధాంత తత్వాలను అభ్యసించేందుకు వచ్చిన విద్యార్థిని. తరుణి సుందరి. ఆమెది కళాత్మక జీవనము. ఆమె నేర్పిన కళయేదో చెప్పలేదు. నృత్య గీతములందు అభినివేశము గలదని సూచించారు.
శాంతిశ్రీలోని అందం యవ్వనంలో దాగున్న, పొదిగున్న పొదుగులాంటిది. శాంతిశ్రీ సంఘారామంలో విద్యార్థిని. బౌద్ధమత నియమాలు యవ్వనంలోని కోరికలను ఆపలేకపోయాయి. పద్మదేవుడు శాంతి శ్రీ చిత్రపటాన్ని చిత్రించడంలో అతని ప్రణయోదంతం సినారె ప్రేమరసంతో చిత్రించారు.
‘శాంతిశ్రీ కనురెప్పల
చాంచల్య మదృశ్యమయ్యె
ఆమె యనిమిషత్వమపుడె
అందికొన్నియట్టులయ్యె
చేతిలోన వడిలేసిన
చేలాంచల మటులెయుండె
విప్పారిన చిరుపెదవులు
విప్పారక యటులెయుండె’
శాంతిశ్రీ అప్సరో
విశాలనేత్ర యైనయట్లు
మాటలలోనే స్వప్న స
మాలింగన మొనరించెను
‘ఆమె వెనక్కడుగు వేయదు
అతడు ముందు కడుగువేయ
డాయె వెనక్కడుగు వేయ
దిర్వురిలో కదల సాగె
నేదో అవ్యక్త బాధ
ఆ బాధకు పేరు లేదు
ఆ బాధకు నోరు లేదు
ఆ బాధకు మించిన తి
య్యని బాధయె వేరు లేదు’
‘పద్మదేవుడంత రెండు
పదములు కుడ్యమ్ము వైపు
నడచి సంగ్రహించెనామె
నవ్య చిత్రఫలకమ్మును
తన అధరాంచలములపై
దరస్మితము కుట్మలించ
ఆమె పాణిపద్మములం
దర్పించెను చిత్తరువును’
‘మతమొక్కటి దక్క తాను
ఇతరము కోరకయున్నను
అతని కానుకను పరిగ్ర
హణయు చేసెను రయమ్ము
అతడర్పించిన చిత్తరు
నద్దుకొనెను హృదయమ్మున’
పద్మదేవుడు, శాంతిశ్రీల మధ్య ప్రణయం అంకురిస్తుంది. వినిర్మలమైన ప్రణయానికి తీరాలుండవు, అడ్డుగోడలుండవు. మధురమైన రసరాగ రంజితమైన జీవిత తన్మయత్వాలే ప్రధానం. పద్మదేవునిది ప్రణయార్ధ హృదయం. శాంతిశ్రీ మొట్టమొదటిసారి రాగానే అతని అనంతమైన అనుభూతి వెల్లివిరుస్తుంది. ఆమెను చూడగానే హృదయం పరిమళిస్తుంది. ఆ స్పందనయే శాంతిశ్రీ వర్ణచిత్రానికి ప్రాణం పోసింది. శాంతిశ్రీ అందచందాలలో తేలిపోయి ఊహాలోకాల్లో విహరిస్తాడు.
శాంతిశ్రీ అప్సరస అయినట్లు, తాను గంధర్వుడైనట్లు పరవశుడవుతాడు. ప్రణ యం కోసం స్వీయ కళాజీవితాన్ని త్యాగం చేసిన ప్రణయమూర్తి. శాంతిశ్రీ ప్రణయార్ధ హృదయ కళామూర్తి. పద్మదేవుని చూడగానే తనను తాను మరచిపోతుంది. అతని స్నేహం వల్ల అతని నుంచి స్వీయ చిత్ర ఫలకాన్ని స్వీకరించిన ప్రణయార్ధ్ధ్ర చిత్త. ఆమె శాంతిశ్రీ. అధీర, అనిశ్చిత స్వభావ. పద్మదేవుని ప్రణయానికీ, మతాచారోనపదేశానికి మధ్య ఆమె చిత్తము ప్రవాహనీతమైన పూదోనె చందాన ఆందోళన చెందుతుంది.
‘అదో పద్మదేవుండు
అదో వేణునాళమ్ము
అతని గానమునమూ
మూర్తితమయ్యె కాలమ్ము
అతడు కించిన్ని మీ
లితీ నేత్రుడై మురళి
పై యంగుళులు మోపి
వాయించె గీతములు’
‘అతడు షడ్జ స్వరము
నందుకొనగ మయూర
మటుల శాంతిశ్రీయు
నటనమ్ము గావించె
అతడు పంచమ మెత్తి
ఆలాపనము సేయ
ఆమె కోకిల యగుచు
అమర గానము చేసె
అతడు పాడిన పాట
ఆమె ఆడిన ఆట
అచ్చముగ బింబించె
నా తరంగిణి నీట
మత నియమాలను ధిక్కరించి పద్మదేవుని అందుకోవాలనే తాపత్రయం వలన శాంతిశ్రీలో హృదయ రాగబంధం నుంచి విముక్తం కాలేదని విదితమవుతుంది. ఈ కావ్యంలో శృంగార, శాంత, కరుణ, ప్రేమోరసాలు చోటుచేసుకున్నాయి. మొదటి తరంగంలో శాంతిశ్రీ-పద్మదేవుల పరస్పర దర్శనంతో అంకురించిన శృంగారబీజం, పద్మదేవుడు-యశోద-గౌతముల ప్రణయ ఘట్టాన్ని చిత్రిస్తున్న సమయంలో శాంతిశ్రీ అక్కడికి రావడం, అతని చిత్రాలు చూసి ఆమె మురిసిపోవడం, యవ్వన సౌందర్యంతో తొణికిసలాడుతున్న శాంతిశ్రీ ముగ్ధమోహన సౌందర్యాన్ని చూసి అతను మురిసిపోతాడు.
‘పద్మదేవుని హృదిని
పరిమళమ్ములు వీచె
పద్మదేవుని కెదియొ
స్పర్శించినటు తోచె
తలను వెన్కకు ద్రిప్పి
తిలకించెనడతుడి చం
చలవంటి దొర వె
న్నెల వంటి రూపమ్ము’
కన్నె పడతుల అందం విరులొలికే పూలరేకులు. ప్రకృతిని పరిహాసం చేసే పున్నమి వెన్నెల అందం పడతిది. శాంతిశ్రీలోని అందం యవ్వనంలో దాగున్న పొదుగున్న పొదుగు లాంటిది. బౌద్ధమత సంఘారామ నియమాలు యవ్వనంలోని శారీరక వాంఛా కోరికలను ఆపలేకపోయాయి. ముగ్ధ మోహన సౌందర్యరాశియైన శాంతిశ్రీ నవనోన్మేషణ హృదయశీలియైన పద్మదేవుని మధ్య అంకురించిన ప్రణయ వృత్తాంతంతో ‘నాగార్జునసాగరం’ కావ్యాన్ని ప్రణయోదంతంగా చిత్రించారు.
‘ప్రకృతిలోని ప్రత్యణువున
పరమాద్భుత శోభాన్విత
సౌందర్యము నిర్లిప్త
స్థాయిలోని నిద్రించును
నిద్రిత సౌందర్యమును
న్మిషిత మొనర్చును సుత్తి
నిగూఢ సుందరతను వ
ర్ణిత మొనరించును కుంచియ’.
-డాక్టర్ సందినేని రవీందర్
9491078515