ఎల్లారెడ్డి రూరల్, నవంబర్ 22 : ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వడ్డేపల్లి సుభాష్‌రెడ్డికి పీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ (డీఏసీ) శుక్రవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు భారీగా ఫిర్యాదులు రావడంతో నోటీసు ఇచ్చిన డీఏసీ చైర్మన్ చిన్నారెడ్డి.. వారంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తల నుంచి అనేక ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల అమలుకు సంబంధించి ప్రతికూల సమాచారాన్ని ప్రజల్లో వ్యాప్తి చేస్తుండడం, పార్టీ సీనియర్ నేతలను సంప్రదించకుండా పార్టీ కార్యక్రమాలను పదేపదే ప్రశ్నిస్తున్నందున నోటీసు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా పార్టీలో చీలికలు సృష్టించడం ద్వారా కేడర్‌ను విభజిస్తున్నాడని, ప్రొటోకాల్‌ను విస్మరిస్తూ పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, పొరుగున ఉన్న మహారాష్ట్రలో కూడా పార్టీ కేడర్‌లో తప్పుడు సంకేతాలు పంపుతున్నందున షోకాజ్ నోటీస్ ఇచ్చినట్లు తెలిపారు. వారంలోపు వివరణ ఇవ్వాలని, లేకపోతే చర్యలు తప్పవని పేర్కొన్నారు.