బోధన్, ఆగస్టు 29: నిజామాబాద్ జిల్లాలోని మంజీర పరీవాహక ప్రాంతం అతలాకుతలమైంది. నలభై ఏళ్ల కిందటి భారీ వరదల పరిస్థితిని తీర ప్రాంత గ్రామాలు మళ్లీ ఇప్పుడు ఎదుర్కొంటున్నాయి. వాగులు, వంకలు పొంగడంతో పాటు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరద వస్తుండడంతో ఉప్పొంగి ప్రవహిస్తున్న మంజీర గురువారం మధ్యాహ్నం నుంచే సాలూర మండలంలోని మందర్న, ఖాజాపూర్, హూన్సా, మందర్న గ్రామాలను చుట్టుముట్టింది. శుక్రవారం తెల్లవారేసరికి ఈ గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకెళ్లింది.
వరద భయంతో అనేక మంది ఇళ్లను వదిలి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత తరలివెళ్లారు. మంజీర తీరంలోని ఈ గ్రామాలతో పాటు ఇదే నది తీరంలో ఉన్న హంగర్గా, భిక్నెల్లి, ఖండ్గావ్, కొప్పర్గ గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏడు గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. కొప్పర్గ, ఖండ్గావ్ మినహాయించి మిగతా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
ఒకపక్క ఎగువన నిజాంసాగర్ నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి వచ్చే లెండి నదికి కూడా వరద ఉధృతి పెరుగుతున్నది. మరోపక్క ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ వల్ల మంజీర వరద ఉధృతి మరింతగా పెరుగుతున్నది. ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవడానికి యంత్రాంగం ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. మందర్న, హంగర్గా గ్రామాల్లోని వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎగువ నుంచి వస్తున్న గోదావరి వరదకు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తోడవటంతో నవీపేట్ మండలంలోని మిట్టపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మంజీర తీరం వెంబడి సాగు చేసిన సోయాబీన్, ఆకుకూరలు, చెరుకు, ఇతర పప్పు ధాన్యాల పంటలను వరద నీరు ముంచెత్తింది.
మంజీర నదికి 1983లో వచ్చిన వరదలు తీర ప్రాంత గ్రామాల్లో బీభత్సం సృష్టించాయి. సుమారు నలభై ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ స్థాయిలో వరద వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.