Ram Gopal Varma | తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘శివ’ మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది. నాగార్జున–రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో 1989లో వచ్చిన ఈ కల్ట్ క్లాసిక్ తెలుగు సినిమా రూపురేఖలను మార్చేసిందని సినీ ప్రేమికులు చెబుతారు. రియలిస్టిక్ అప్రోచ్, సహజమైన సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమా అప్పట్లో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీని “శివ సినిమాకి ముందు – శివ సినిమాకి తరువాత” అని విభజించి చెప్పేంత స్థాయిలో ఈ మూవీ ప్రభావం చూపించింది. ఇప్పుడు ఈ లెజెండరీ సినిమా 4K ఫార్మాట్లో నవంబర్ 14న రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రమోషన్లలో పాల్గొంటూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
తాజా ఇంటర్వ్యూలో యాంకర్ ఒక ప్రశ్నతో ఆర్జీవీకి సవాలు విసిరాడు. “శివ సినిమా హిట్ అయిన తర్వాత ‘చిరంజీవి’ మ్యాగజైన్లో – ఈ సినిమా నాగార్జున కాకుండా చిరంజీవి చేసుంటే ఎలా ఉండేదో?” అనే శీర్షికతో కథనం వచ్చింది. ఇప్పుడు అదే ప్రశ్న మీకు అడుగుతున్నా.. నిజంగానే చిరంజీవి ‘శివ’ చేసుంటే ఎలా ఉండేది?” అని అడిగారు. అప్పుడే కాదు, ఇప్పటికీ చాలా సినిమాలు హిట్ అయ్యాక అదే సినిమాను పెద్ద హీరోతో చేస్తే ఎలా ఉండేది అని అడుగుతారు. కానీ ‘శివ’ అనే పాత్రకు నాగార్జున సరిగ్గా సరిపోయాడు. అదే సినిమా చిరంజీవి చేసుంటే ఎలా ఉండేదో చెప్పలేం,” అని సమాధానమిచ్చారు.
ఆర్జీవీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు “నాగార్జున లుక్, బాడీ లాంగ్వేజ్ లేకుండా శివ ఊహించలేం” అంటూ కామెంట్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో, నాగార్జున హీరోగా వచ్చిన శివ సినిమా 35 సంవత్సరాల తర్వాత ప్రేక్షకులను మరోసారి అలరించడానికి సిద్ధమవుతోంది. 4K ఫార్మాట్లో రీ రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినీ అభిమానులు “ఓల్డ్ బట్ గోల్డ్” అంటూ సోషల్ మీడియాలో ఉత్సాహంగా షేర్ చేస్తున్నారు. సినిమా రీ రిలీజ్ సందర్భంగా నాగార్జున, ఆర్జీవీ మరోసారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రేక్షకులకి ఉత్సాహాన్ని అందిస్తున్నారు.