హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థుల వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివించేందుకే తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ బడుల్లో… తెలుగు మీడియం విద్యార్థులు చాలా తక్కువ మంది ఉంటున్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లలో మొత్తం 36.19 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 35.13 లక్షల మంది (97.09 శాతం) ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు. ఇక తెలుగు మీడియంలో చదువుతున్న వారి సంఖ్య 17,329 (0.48శాతం) మాత్రమే. తరగతుల వారీగా పరిశీలిస్తే 10 తరగతిలో అత్యధికంగా 98.22 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. ఒకటో తరగతి పిల్లల్లో 93.57 శాతం ఇంగ్లిష్లోనే చదువుతుండటం గమనార్హం.
రాష్ట్రంలో ప్రైవేట్ బడుల్లోనే కాదు.. సర్కారు, ఎయిడెడ్ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం హవానే నడుస్తున్నది. సర్కారు బడుల్లో మొత్తం 22.42 లక్షల మంది విద్యార్థులుంటే 17.65 లక్షలు (78.75శాతం) ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు. మరో 3.51 లక్షలు (15.66 శాతం) మాత్రమే తెలుగు మీడియం విద్యార్థులున్నారు. తరగతుల వారీగా గమనిస్తే 6వ తరగతిలో 82.20 శాతం, 7వ తరగతిలో 82.28 శాతం, 8వ తరగతిలో 82.28 శాతం, 9వ తరగతిలో 81.86 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు.
తెలుగు మీడియం పరిశీలిస్తే ఐదో తరగతిలో 20.31 శాతం మంది విద్యార్థులు చదువుతున్నారు. అన్ని తరగతుల్లో ఇదే అత్యధికం. ఇక ఎయిడెడ్ స్కూళ్లలో మొత్తం 59,140 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 45,054 (76.18శాతం) ఇంగ్లిష్ మీడియం వారు కాగా, 8,420 (14.24 శాతం) తెలుగు మీడియం వారున్నారు. మిగిలిన వారు ఉర్దూ, కన్నడ, మరాఠీ, హిందీ, తమిళ మీడియంలో చదువుతున్నారు.
