ఎల్లారెడ్డి రూరల్, ఫిబ్రవరి 18: సంత్ సేవాలాల్ మహరాజ్.. ఈ పేరు వింటే తండాలు భక్తిపారవశ్యంలో మునిగిపోతాయి. గిరిజన తండాలు ఆయన నామస్మరణ చేస్తాయి. సేవాలాల్ దీక్షలతో యువతలో భక్తి భావం వెల్లివిరుస్తున్నది. మహశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గిరిజనులు తమ ఆరాధ్య గురువైన సేవాలాల్ మహారాజ్ దీక్షలు తీసుకోవడం ప్రారంభిస్తారు.
ప్రతి యేటా చేపడుతున్న దీక్షలతో యువత భక్తిభావంలో మునిగి తేలుతున్నది. గిరిజనులు ప్రతిఏటా మహాశివరాత్రితో దీక్షాధారణ చేసి శ్రీరామ నవమి వరకు 41 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో మండల దీక్షలు చేపడుతారు. దీంతో తండాల్లో ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. మాలధారణ చేసిన వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా భక్తిభావంతో నిష్టగా ఉంటారు. చిన్నాపెద్దా లేకుండా ప్రతి ఒక్కరూ భక్తిభావంలో మునిగిపోతారు.
నేటి కాలంలో ప్రతి గిరిజన తండాలో సేవాలాల్ దీక్షాధారులు విరివిగా కనిపిస్తున్నారు. మండల రోజుల పాటు గ్రామ శివారులో ఎంచుకున్న స్థలంలో జగదాంబమాత, సేవాలాల్ మహరాజ్ రూపాలను ప్రతిష్ఠించుకుంటారు. దీక్ష తీసుకున్నవారందరూ అక్కడే ఉండడానికి, పూజలు చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. సామూహిక పూజలు, భజనలు,భోజనాలతో తండాలు భక్తిపారవశ్యంలో మునిగిపోతాయి.ప్రతి సంవత్సరం సేవాలాల్ దీక్ష చేపట్టే యువకుల సంఖ్య పెరుగుతున్నది. దీక్షాధారులు వారి వీలును బట్టి మండలం, అర్ధమండలం, పావు మండలం రోజుల పాటు దీక్షలు చేయడానికి మాలధారణ చేస్తుంటారు.
కఠిన దీక్ష నియమాలు.. ఏక భుక్తం.
అయ్యప్పస్వామి దీక్ష, శివదీక్ష, హనుమాన్ దీక్షల మాదిరిగానే సేవాలాల్ దీక్షలో కూడా కఠిన నియమాలు ఉంటాయి. మద్యపానం, మాంసాహారం, అబద్ధాలకు దూరంగా సన్మార్గంలో తమను నడిపించేందుకు సేవాలాల్ దీక్షలు చేపడుతున్నట్లు దీక్షాధారులు చెబుతున్నారు. గులాబీరంగు చొక్కా, తెల్లని ప్యాంటు లేక లుంగీ, గులాబీ కండువా, రుద్రాక్షమాలను దీక్షలో భాగంగా ధరిస్తారు. ఇండ్లకు దూరంగా ఉంటారు. సూర్యోదయానికి ముందుగానే లేచి చన్నీటి స్నానం, జగదాంబమాత , సేవాలాల్ మహరాజ్ చిత్రపటాలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఏకభుక్తం (ఒక్కపూట భోజన), భూతల శయనం తదితర కఠిన నియమాలను అనుసరిస్తారు.
ఉదయం, సాయంత్రం స్నానం పూజలు తప్పనిసరి. ప్రతిరోజూ రాత్రి అందరూ కలిసి భజన కార్యక్రమం నిర్వహిస్తారు.దీక్షలు ముగిసేవరకు జగదాంబ మాత, సేవాలాల్ మందిరాల ముందు గుంతలు తవ్వి, కర్రలతో మంటలు మండిస్తారు. రాగి పాత్రలో రవ్వ, చెక్కరి, ఆవునెయ్యి తదితర పదార్థాలతో పాయసం వండి, పాయసాన్ని అగ్నికి ఆహుతి ఇస్తారు. దీక్షలు తీసుకున్న వారి కుటుంబ సభ్యులు కూడా దీక్షలు పూర్తయ్యేవరకు మద్యానికి, మాంసాహారానికి దూరంగా ఉంటారు. తమ ఇంట్లోనే కాకుండా బంధుమిత్రుల ఇండ్లకు వెళ్లినా నిబంధనలు పక్కాగా పాటిస్తారు.
పెరుగుతున్న దీక్షలు
ప్రతీ ఏటా సేవాలాల్ దీక్షలు తీసుకొనేవారి సంఖ్య పెరుగుతున్నది.ముఖ్యంగా యువత దీక్షలకు ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం సేవాలాల్ దీక్షలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు విస్తరించాయి. మండల దీక్షల అనంతరం మాల విరమణ చేయడానికి మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా పౌరాఘడ్లో ఉన్న జగదాంబ, సేవాలాల్ ఆలయానికి వెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దీక్ష విరమణ చేస్తారు.
దీక్షలతో మార్పు..
సుమారు ఐదేండ్లుగా సేవాలాల్ దీక్షను చేపట్టి , మండల రోజులు దీక్షలో ఉంటున్నాను. ప్రతి సంవత్సరం నేను చేపట్టే సేవాలాల్ దీక్షతో నాతోపాటు మా కుటుంబ సభ్యుల్లో కూడా మార్పు కనిపిస్తుంది. దీక్షాధారులమంతా సంత్ సేవాలాల్ మహరాజ్ బాటలో నడుస్తున్నాం.
-అజ్మీరా నగేశ్, సోమిర్యాగడి తండా
మద్యం, మాంసాహారానికి దూరంగా..
19 ఏండ్లుగా సేవాలాల్ దీక్ష చేపడుతున్నా. దీక్ష నిబంధనలను అనుసరించి మండలం రోజులు అబద్ధాలు, మద్యానికి దూరంగా ఉండడంతోపాటు మానసికంగా, శారీరకంగా మంచి మార్పు వచ్చింది. నాతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా మండలం రోజుల పాటు భక్తిభావంతో కలిగి ఉంటారు.
-పాత్లోత్ గోవింద్, 19వ సంవత్సరం దీక్షాధారుడు – సోమిర్యాగడి తండా
యువతలో భక్తి భావాన్ని పెంచుతున్నాయి..
సేవాలాల్ దీక్షలు తీసుకున్న యువతలో ముఖ్యంగా భక్తిభావం, ఏకతా భావం పెరగుతున్నది. ఇది చాలా శుభ పరిణామం. నేటి ఆధునాతన కాలంలో యువత చెడు వ్యసనాలకు లోనై తమ ఆరోగ్యంతోపాటు కుటుంబ పరిస్థితిని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితికి విరుగుడుగా సేవాలాల్ దీక్షలు పనిచేస్తున్నాయి. దీక్షలతో సంస్కృతీ సంప్రదాయాలను ముందు తరాల వారికి భద్రంగా అందించగలుగుతాం. యువతలో ఎంతో మార్పు, పరివర్తన వస్తుంది. జాతి ఐక్యత,చైతన్యం,మనుగడ కోసం గిరిజనులు దీక్షలు తీసుకోవడం సరైన నిర్ణయం. దీక్షలతో ప్రధానంగా భక్తిభావం పెరిగి, దుర్మార్గపు ఆలోచనలు తగ్గిపోయి, సన్మార్గంలో జీవిస్తారు.
– సబావత్ సంగారామ్ నాయక్, హాజీపూర్ తండా, ప్రైవేట్ కళాశాల అధ్యాపకుడు