భీమ్‌గల్,అక్టోబర్ 3 : సీఎం కేసీఆర్ సహకారంతో రాష్ట్రంలోనే మొట్టమొదటగా బాల్కొండ నియోజకవర్గంలోనే తీజ్ భవనాలకు నిధులిస్తున్నామని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గిరిజనుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని, తండాలను జీపీలుగా చేసిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. పట్టణంలో మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వేముల.. రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి బాల్కొండ నియోజకవర్గంలో తీజ్, సేవాలాల్ భవనాల నిర్మాణానికి నిధుల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి తండాకూ జీపీ భవనాలతోపాటు బీటీ రోడ్లు వేసుకున్నామని, ఇంటింటికీ భగీరథ నీళ్లు ఇస్తున్నామని తెలిపారు.
3వేల మందికి 7వేల ఎకరాల పోడు పట్టాలను పంపిణీ చేశామని గుర్తుచేశారు. ఇప్పుడు సేవాలాల్, తీజ్ భవనాల నిర్మాణానికి రూ. 2.50కోట్ల ప్రొసీడింగ్స్ ఇచ్చామన్నారు. మానాల ప్రాతంలోని తండాల్లో లింక్ రోడ్లను నిర్మిస్తున్నామని, అటవీశాఖ అనుమతులను తెచ్చి మానాల-మరిమడ్ల రోడ్డు వేస్తున్నామని చెప్పారు. గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్న తనను ఆశీర్వదించాలని మంత్రి వేముల కోరారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాయమాటలను నమ్మి మోసపోవద్దని, మీకు అండగా నిలబడిన వారికే మద్దతివ్వాలన్నారు. అనంతరం పట్టణంలోని రాథం చెరువు మినీ ట్యాంక్ బండ్‌ను మంత్రి ప్రారంభించారు. ఉదయం వంద పడలకల దవాఖాన, అప్రోచ్ రోడ్డు తదితర పనులకు శంకుస్థాన చేశారు.
సీఎం కేసీఆర్‌కు కుడిభుజం వేముల: మంత్రి సత్యవతి రాథోడ్
సీఎం కేసీఆర్‌కు మంత్రి ప్రశాంత్‌రెడ్డి కుడిభుజం లాంటివారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్వయంగా ఇంజీనీర్ అయిన వేముల.. రాష్ట్రంలో చేపట్టిన అనేక చారిత్రాత్మక కట్టడాల్లో భాగస్వామ్యం కావడం గొప్ప విషయమని కొనియాడారు. తండ్రి సురేందర్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ రూ. వేల కోట్ల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. పునర్జీవ పథకం ద్వారా రైతుల సాగునీటి గోస తీర్చిన వేములకు మద్దతుగా నిలువాలని కోరారు. కేసీఆర్ పాలనలో గిరిజనులకు స్వర్ణ యుగం వచ్చిందన్నారు. గిరిజన రిజర్వేషన్‌ను ఆరు నుంచి పది శాతానికి పెంచడంతో విద్య, ఉద్యోగ అవకాశాలు పెరిగాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో 3416 తండాలను గిరిజన బిడ్డలే పాలకులగా అభివృద్ధి చేసుకుంటున్నారని అన్నారు.
188 గిరిజన గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల్లో గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూ.140 కోట్లతో హాస్టళ్లను నిర్మించినట్లు చెప్పారు. గిరిజన రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే బీజేపీ ప్రభుత్వం తొక్కిపడేసిందని ధ్వజమెత్తారు. గిరిజనులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పార్లమెంట్లో సేవాలాల్ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ ప్రకటన.. ప్రధాని మోదీ మోసపూరిత కుట్రగా పేర్కొన్నారు. గిరిజన యూనివర్సిటీ కోసం 2014 నుంచి పోరాడితే అన్యాయం చేశారని, యూనివర్సిటీ ఏర్పాటుకు అడ్డుపడ్డ ద్రోహులు నేడు ఎన్నికల సమయంలో రూ. 900కోట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. రూ. 9 లక్షల కోట్లు ఇచ్చినా గిరిజనుల బిడ్డలు బీజేపీని నమ్మబోరని అన్నారు. ఒక అవకాశం ఇవ్వాలని రేవంత్‌రెడ్డి ఏం ముఖం పెట్టుకొని అడుగుతున్నాడని ప్రశ్నించారు. 65 ఏండ్లు పాలించిన కాంగ్రెస్.. తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆశలన్నీ అడియాశలే అవుతాయన్నారు.
తెలంగాణలో రూ. 4వేల పింఛన్ ఇస్తామంటున్న కాంగెస్.. ఇతర రాష్ర్టాల్లో రూ. 700మాత్రమే ఇస్తున్నదని గుర్తుచేశారు. అక్కడ అమలుచేయని సంక్షేమ పథకాలు తెలంగాణాలో ఎలా ఇస్తారో చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కుట్రలు చేసిరా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. అంతకుముందు మంత్రి సత్యవతి రాథోడ్‌కు బంజారాలు ఘనస్వాగతం పలికారు. మంత్రి వేముల పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. మంత్రులిద్దరూ గిరిజన మహిళలలతో కలిసి నృత్యం చేశారు. కార్యక్రమంలోఫ్యామిలీ అండ్ హెల్త్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ప్రేమలతా సురేందర్, జడ్పీటీసీ రవి, రైతు నాయకుడు కోటపాటి, జిల్లా బంజారా సంఘం అధ్యక్షుడు చంద్రునాయక్, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.