కామారెడ్డి రూరల్ , మే 29: జీలుగ విత్తనాల కోసం రైతులు ఆందోళన చేపట్టారు. సరిపడా పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేయక పోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి మండలం ఇస్రోజివాడి రైతు వేదికలో గురువారం సబ్సిడీపై జీలుగ, పెద్దజనుము విత్తనాలు పంపిణీ చేపట్టారు. విత్తనాలు సగం మంది రైతులకే రావడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరకొర విత్తనాలను తెప్పించి రైతులను ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మండలంలో సాగు భూములు, రైతుల వివరాలు మీకు తెలియవా? అని ప్రశ్నించారు. వెంటనే విత్తనాలు తెప్పించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో విత్తనాలు తెప్పిస్తామని అధికారులు చెప్పడంతో రైతులు శాంతించారు.