ఉమ్మడి జిల్లాలో ఆయనో సీనియర్ ఎమ్మెల్యే. దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో అనుభవ శీలి. మంత్రిగా పని చేసిన అనుభవం సొంతం. మొన్నటి ఎన్నికల్లో మరోసారి గెలిచినా అమాత్య పదవి మాత్రం అందలేదు. కానీ మంత్రి హోదాను మాత్రం అనుభవిస్తున్నారు. ఆయన వేరేవరో కాదు.. కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి. నేడు, రేపు అంటూ ఉవ్విళ్లూరే కేబినెట్ విస్తరణ ప్రకటనలతో సరి పెట్టుకుంటూ మంత్రి స్థాయిలో అనధికారికంగా ప్రొటోకాల్ పొందుతున్నారు. మంత్రి కాని మంత్రిగా ఉమ్మడి జిల్లాపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే హోదాలోనే సుడిగాలి పర్యటనలు చేస్తూ, అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశనం చేస్తున్నారు. పక్క నియోజకవర్గాల్లోనూ పని కల్పించుకుని సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇలా మంత్రి కాకుండానే మంత్రిగా సుదర్శన్‌రెడ్డి ఉమ్మడి జిల్లా పాలనా యంత్రాంగాన్ని ప్రభావితం చేస్తున్నారు. కలెక్టర్లు, సీపీ, ఎస్పీ సైతం ఆయనకే జై కొడుతున్నారు. ఎమ్మెల్యేలు సైతం ఆయన వద్దకే క్యూ కడుతున్నారు. పోలీస్ శాఖ ఏకంగా కేబినెట్ ర్యాంక్ కలిగిన ప్రజాప్రతినిధికి కల్పించే భద్రతను కల్పిస్తున్నది.
-నిజామాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి మంత్రివర్గంలో చోటు ఖాయమని తొలి నుంచీ ప్రచారం జరిగింది. కానీ పెద్దాయనకు మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు. నేడో రేపో అంటూ మొదలైన కాలయాపన ఏకంగా నవ మాసాలు దాటిపోయింది. మంత్రి పదవి రాకపోవడంపై అసంతృప్తిగా ఉన్న సుదర్శన్‌రెడ్డి నారాజ్ కాకుండా ఉండేందుకు సీఎం కార్యాలయం ఓ ప్లాన్ వేసినట్లు తెలిసింది. ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును నామమాత్రం చేసి, సుదర్శన్‌రెడ్డి విలువను పెంచేందుకు కాంగ్రెస్ అధిష్టానం కొత్త ఎత్తుగడకు తెర లేపినట్లు సమాచారం. అందులో భాగంగానే మంత్రి స్థాయిలో గౌరవ, మర్యాదలు కల్పించేలా అధికార యంత్రాంగానికి మౌఖిక ఆదేశాలను జారీ చేసినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
ఇన్చార్జి మంత్రులంతా ఇతర జిల్లాల్లో హడావుడి చేస్తుంటే ఉమ్మడి నిజామాబాద్‌లో మాత్రం స్తబ్ధుగా ఉండడానికి కారణం ఇదేనన్న చర్చ నడుస్తున్నది. మరోవైపు, మంత్రివర్గ కూర్పులో వివిధ సామాజిక సమీకరణల మూలంగా జరుగుతున్న జాప్యమే తప్ప సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి కేబినెట్ బెర్త్ ఖాయమైందని పీసీసీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
అయితే, కాలయాపన వల్ల సుదర్శన్‌రెడ్డిలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకే ఉమ్మడి జిల్లా పరిపాలనను ఆయన చేతిలో పెట్టినట్లు తెలిసింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకున్నప్పటికీ మౌఖిక ఆదేశాలతో ప్రభుత్వ శాఖలపై అజమాయిషీ చేస్తున్న సుదర్శన్‌రెడ్డి తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. బోధన్‌తో పాటు ఇతర నియోజకవర్గాల్లోనూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోటా మరింత ఎక్కువగా దృష్టి పెట్టి పాలనాపరమైన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
మరోవైపు, మంత్రి స్థాయిలో ప్రొటోకాల్ దక్కించుకుంటున్న సుదర్శన్‌రెడ్డికి జెండావిష్కరణకు అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వ విప్, కార్పొరేషన్ చైర్మన్లకు ప్రభుత్వం అవకాశం కల్పించగా, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న వారికి మాత్రం చోటు ఇవ్వలేదు. మొన్న జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో నిజామాబాద్‌లో మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ జెండావిష్కరణ చేయగా, సెప్టెంబర్ 17న కూడా ఆయనకే మరోసారి అవకాశం దక్కింది. సుదర్శన్‌రెడ్డికి మా త్రం ఆ అవకాశం లేకుండా పోయిం ది. కామారెడ్డిలో జిల్లాకు సంబంధం లేని పటేల్ రమేశ్‌రెడ్డి జెండా ఆవిష్కరించారు. అయితే, మంత్రి కాని మంత్రి హోదాలో కొనసాగుతున్న సుదర్శన్‌రెడ్డికి జెండా ఆవిష్కరణ చేసే అవకాశం దక్కక పోవడంపై బోధన్ నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొన్నది.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పోలీసుల బదిలీల వ్యవహారం అధికార పార్టీలో చిచ్చురేపింది. కేవలం సీనియర్ ఎమ్మెల్యే ఓకే చెప్పిన వ్యక్తులకే పోలీస్ ఉన్నతాధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారిని కాదనడంపై వివాదం రాజుకున్నది. ఒక దశలో ఈ వ్యవహారం పోలీస్ ఉన్నతాధికారి వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నట్లుగా మారింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేకు, పోలీస్ ఉన్నతాధికారికి మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం బాహాటంగానే కనిపిస్తున్నది.
రైతు రుణమాఫీ విషయంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీని ఎస్సై స్థాయి అధికారితో అనుమతి లేదంటూ నిలువరించడం ఉమ్మడి జిల్లాలో తీవ్ర దుమారమే రేపింది. ఈ ఇష్యూ ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి దాకా వెళ్లినట్లు తెలిసింది. కొంత మంది సీఐల బదిలీ వ్యవహారంలోనూ పోలీస్ ఉన్నతాధికారి పంతం నెగ్గించుకోవడం, సీనియర్ ఎమ్మెల్యే మాటకు ఇచ్చే మర్యాద కొత్త ఎమ్మెల్యేకు దక్కక పోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.