ధర్పల్లి, ఏప్రిల్ 8: మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను స్థానిక నిరుపేదలు మంగళవారం ఆక్రమించుకున్నారు. ఇండ్లకు తాళాలు వేసుకోగా..విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని, వారిని సముదాయించి ఖాళీ చేయించారు. మండల కేంద్రంలోని భీమ్గల్ రోడ్డులో బీఆర్ఎస్ హయాంలో 48 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించారు. ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారితోపాటు నిరుపేదలు మంగళవారం డబుల్ బెడ్ రూం ఇండ్లను స్వాధీనం చేసుకున్నారు.
తాళాలు ఉండగా వాటిని పగుల గొట్టి ఆక్రమించుకున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ మాలతి అక్కడికి చేరుకొని పోలీసులను పిలిపించారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. ఇండ్లు 48 ఉన్నాయని, లబ్ధిదారులు వేలల్లో ఉన్నారని తెలిపారు. ఇంకా కిటికీలు, సంపు, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు పూర్తి కాలేదని చెప్పారు. ఇండ్లను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకోవడం నేరమవుతుందని నచ్చజెప్పారు. ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని, నిబంధనల మేరకు అర్హులను ఎంపిక చేసి డ్రా పద్ధతిన అందజేస్తామని తెలిపారు.
ఇదివరకే పలుమార్లు దరఖాస్తులు ఇచ్చామని అయినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ చేతుల్లో ఏమీలేదని అధికారుల ఆదేశాల మేరకు దరఖాస్తు చేసుకుంటే అర్హులకు అందేలా చూస్తామని తహసీల్దార్ స్పష్టం చేశారు. డీటీ ప్రవీణ్, ఎస్సై రామకృష్ణ , నాయకులు ఆర్మూర్ చిన్నబాల్రాజ్, చెలిమెల శ్రీనివాస్ ఉన్నారు.