ఆర్మూర్, సెప్టెంబర్ 8:ఊరంతా ఒక్కమాట మీద నిలబడితే ఆ ఊరు అద్భుతమవుతుంది. సమష్టి కృషితో సమస్తం సాకారం అవుతుంది. స్వయం కృషితో ఎదిగిన ప్రతి ఊరూ అంకాపూర్ అవుతుంది. యాభై ఏండ్ల కిందట అన్ని ఊర్ల మాదిరే ఈ ఊరు. ఆనాడు ఊరి అభివృద్ధి కోసం అంతా ఏకమయ్యారు. సమస్యలను పరిష్కరించుకుంటూ, ఆదాయ మార్గాలని పెంచుకుంటూ దినదినాభివృద్ధి చెందారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల్ని అందిపుచ్చుకొని, వ్యాపారంలో రాణిస్తూ దేశానికే పొలం బడి పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు. అద్భుతమైన భవంతులు, రేంజ్‌రోవర్ కార్లు, ఇంటింటికీ ట్రాక్టర్లు ఇలా అన్నింటా ఆదర్శమై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగడించారు. అద్భుతమైన అంకాపూర్ గ్రామంపై ప్రత్యేక కథనం..
ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామం ఒకప్పుడు అన్ని గ్రామాలలాంటిదే. రైతులు సాగుకు సరైన నీరు లేక, విత్తనాలు లేక సతమతమైన వారే. అప్పట్లో ఈ గ్రామం నిజాం సంస్థానంలో భాగం. చుట్టు పక్కల భూములన్నీ గడ్డం వెంకటభూమారెడ్డి అనే జమీందార్ ఆధీనంలో ఉండేది. భూమారెడ్డి హైదరాబాద్‌కు వెళ్లిపోగా ఇక్కడి భూములన్నీ అమ్మేయడంతో ఆ భూములను కొన్న రైతులు ప్రస్తుతం గ్రామ స్వరూపాన్నే మార్చివేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పుణ్యమా అని నీటి వసతి సమృద్ధిగా ఉండడంతో మొదట కేవలం వరినే సాగు చేసేవారు. 1970 సంవత్సరంలో హేమచందర్ అనే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి అంకాపూర్ గ్రామాన్ని సందర్శించి నేల స్వభావాన్ని పరిశీలించి రైతులకు సంకర విత్తనాలను పరిచయం చేశారు. ఈ పంటలు పండిస్తే లాభాలు సమృద్ధిగా ఉంటాయని తెలుపగా హేమచందర్ ఆలోచనలకు అనుగుణంగా రైతులు సాగు మొదలుపెట్టారు. ప్రస్తుతం వ్యవసాయంలో విజయాలతో వైవిధ్యమైన పంటలను సాగు చేస్తూ అంకాపూర్ దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచింది.
విత్తన తయారీ..
విత్తనోత్పత్తిలో అంకాపూర్ తెలంగాణ రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఇక్కడి రైతులు మూడున్నర దశాబ్దాల కిందటే విత్తనోత్పత్తికి శ్రీకారం చుట్టారు. 1995లో గ్రామంలో రైతులు విత్తనశుద్ధి కేంద్రాన్ని స్థాపించారు. సజ్జ, ఎర్రజొన్న విత్తనాలను శుద్ధి చేసి తిరిగి కొనుగోలు చేసే ఒప్పందంతో రైతులకు విక్రయించేవారు. పంట చేతికి వచ్చాక నాణ్యత మేరకు ధరను నిర్ణయించేవారు. ప్రస్తుతం అంకాపూర్‌లో సజ్జ, మక్కజొన్న, వరి, విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇతర రాష్ర్టాలకు, దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఎర్రజొన్న విత్తనాలను పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, హర్యానా రాష్ర్టాలకు సరఫరా చేస్తున్నారు. వరి విత్తనాలను గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. సజ్జ విత్తనాలను ఢిల్లీ, కర్ణాటక రాష్ర్టాలకు, మక్కజొన్న విత్తనాలను పంజాబ్, మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలకు పంపిస్తున్నారు. ఇక్కడి ఎర్రజొన్న ,సజ్జ విత్తనాలు పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలకు సైతం సరఫరా అవుతున్నాయి. విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో మొదలై జూలైలో ముగుస్తుంది.
నాటుకోడి కూర స్పెషల్..
అంకాపూర్ నాటుకోడి కూర అత్యంత ప్రసిద్ధి. ఆర్మూర్ ప్రాంతానికి ఎవరు వచ్చినా అంకాపూర్ దేశీ చికెన్ తినేందుకు ఇష్టపడుతుంటారు. అంకాపూర్ నాటుకోడి కూరకు అంత ఆదరణ ఉంది. నాటుకోడి కూర ఆర్డర్ ఇస్తే హైదరాబాద్‌కు సైతం పంపిస్తారు. ఇక్కడి నుంచి విదేశాలకు సైతం పార్సిల్స్ వెళ్తాయి. 1986లో స్వయంగా కారు నడుపుతూ వచ్చి అంకాపూర్ దేశీచికెన్ తిన్నానని, ఇక్కడి చికెన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, తాను ఎప్పుడు నిజామాబాద్ వైపు వచ్చిన అంకాపూర్ నాటుకోడి తింటానని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సార్లు వెల్లడించడం విశేషం.
అందమైన భవంతులు
అంకాపూర్ గ్రామంలో ఎటుచూసినా అందమైన భవంతులు దర్శనమిస్తాయి. గ్రామంలో సుమారు 1400 పైచిలుకు కుటుంబాలు ఉండగా 5,500 వరకు జనాభా ఉంటుంది. వ్యవసాయదారులే అధికం. ప్రతి వీధిలో పెద్దపెద్ద భవనాలు, ప్రతి ఇంటి ఎదుట కారు, ట్రాక్టర్ కనిపిస్తాయి. రైతుల వద్ద పని చేసే కూలీలకు సైతం మంచి ఇండ్లు ఉండడం విశేషం. అందమైన కోట్ల విలువ చేసే భవనాలు ఉండడంతో సినిమా, సీరియల్స్, షార్ట్ ఫిలింస్ షూటింగ్‌లు ఎక్కువగా జరుగుతాయి. అంకాపూర్ గ్రామాన్ని తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాలకు చెందిన రైతులు, ప్రజలు సందర్శిస్తుంటారు.
కూరగాయల సాగు..
అంకాపూర్ గ్రామం పంటల సాగుతోపాటు కూరగాయాలకు ప్రసిద్ధి. పుదీనా, కొత్తిమీర, మెంతికూర, టమాట, చిక్కుడుకాయ, వంకాయ, బీరకాయ, క్యాబేజీ, మిరపకాయ అధికంగా పండిస్తారు. అంకాపూర్ నుంచి హైదరాబాద్, నాగ్‌పూర్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు రవాణా చేస్తారు. వ్యాపారులు నేరుగా వచ్చి కొనుగోలు చేసుకొని ఉత్పత్తులను తరలిస్తారు. నిత్యం ఉదయం అంకాపూర్ గ్రామంలోని మార్కెట్ జాతరను తలపిస్తుంది.
ఏటా కోట్ల వ్యాపారం..
అంకాపూర్‌లో 34 వరకు విత్తన శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. అన్ని కేంద్రాలు రైతుల ఆధ్వర్యంలోనే నడుస్తాయి. ఒక్కో కేంద్రంలో ప్రతి సంవత్సరం రూ.3 నుంచి 4కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఏడాదికి సుమారు రూ.100కోట్లకు పైగా వ్యాపారం అంకాపూర్‌లో సాగుతుంది. వానకాలంలో నాలుగు నెలలపాటు పచ్చి మక్కజొన్న వ్యాపారం జోరుగా సాగుతుంది. రోడ్డుపైనే కుప్పలు కుప్పలుగా పోసుకొని విక్రయిస్తారు. వ్యాపారులు నేరుగా వచ్చి వ్యాన్లు, డీసీఎం, ఆటోల్లో మక్కజొన్న కంకులను కొనుగోలు చేసుకొని ఇతర ప్రాంతాలకు తరలిస్తారు.
మహిళలదే కీలకపాత్ర
వ్యవసాయం అంటేనే ఎంతో కష్టమైన పని. పంట వేసింది మొదలు కుప్పలు ఊడ్చే వరకు అనుక్షణం వ్యక్తిగత శ్రద్ధ ఎంతో అవసరం. పగలు, రాత్రి తేడా ఉండదు. అంకాపూర్ విషయానికి వస్తే వ్యవసాయంలో పురుషుల పాత్ర ఎంతగా ఉంటుందో అంతకు రెండింతలు మహిళల పాత్ర ఉంటుంది. ఇక్కడి మహిళలు వ్యవసాయాన్ని అవలీలగా చేస్తారు. వ్యవసాయంలో ఇక్కడి మహిళల పాత్ర ప్రధానమైనది.