విద్యానగర్, ఆగస్టు 3 : ప్రణాళికతో చదివితే తప్పక విజయం వరిస్తుందని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరంతరం అంకితభావంతో సాధన చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సూచించారు. ఉద్యోగ పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న యువతకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతిలో బుధవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పార్థసారథి హాజరై ఉద్యోగార్థులకు విలువైన సూచనలు, సలహాలు అందజేశారు. ఉద్యోగ సాధనకు అభ్యర్థులు పాటించాల్సిన మెళకువలను ఆకట్టుకునే రీతిలో వివరిస్తూ వారిలో ఆత్మ ైస్థెర్యాన్ని పెంపొందించారు. తన అనుభవాలను జోడించి పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. మొబైల్ ఫోన్లు, అనవసర విషయాలకు దూరంగా ఉండాలని సూచించారు. గతంతో పోలిస్తే ఈ సారి అభ్యర్థులకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని సద్వినియోగం చేసుకొని కొలువు దక్కేలా కష్టపడితేనే విజేతలవుతారని అన్నారు.
కలెక్టర్ జితేశ్ పాటిల్ మాట్లాడుతూ.. అభ్యర్థులకు ఎస్సీ, బీసీ, మైనారిటీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వడంతోపాటు మెటీరియల్‌ను అందజేస్తున్నామని తెలిపారు. నోటిఫికేషన్లు వెలువడినప్పుడు చూపిన ఉత్సాహాన్ని చివరిదాకా కొనసాగించాలన్నారు. అంతకుముందు పార్థసారథి గెస్ట్‌హౌస్‌లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఉన్నతాధికారులతో జిల్లా ప్రగతిపై చర్చించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఏఎస్పీ అన్యోన్య, ఆర్టీవో వాణి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.