మరో నాలుగైదు రోజుల్లో ఇంటర్, 15రోజుల్లో పాఠశాలల తరగతులు ప్రారంభంకానున్నాయి. దీంతో ధనార్జనే ధ్యేయంగా నెలకొల్పిన పలు విద్యాసంస్థల యాజమాన్యాలు వసూళ్ల దందా మొదలుపెట్టాయి. అనుమతులు లేకపోయినా కార్పొరేట్, ఇంటర్నేషనల్ పేరిట తల్లిదండ్రులను బుట్టలో వేసుకుంటున్నాయి. అడ్మిషన్ల పేరుతో రూ.లక్షల్లో ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
– ఖలీల్‌వాడి, మే 27
జూన్ నెల వస్తున్నది. పాఠశాల, కళాశాలల తరగతులు ప్రారంభంకానున్నాయి. తమ పిల్లలకు మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఏ పాఠశాల, కళాశాలలో చేర్పిస్తే బాగుంటుందోనని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని విద్యాసంస్థలు వ్యాపార ప్రయోజనాలే ధ్యేయంగా అడ్డదార్లు తొక్కుతున్నాయి. ర్యాంకులు, మార్కులు చూపుతూ అడ్మిషన్లను ప్రారంభించాయి. తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేస్తున్నాయి.
మరికొన్ని అయితే తమ పాఠశాల, కళాశాలలో అడ్మిషన్లు అయిపోతున్నాయని, సీట్లు తక్కువగా ఉన్నాయని ప్రచారం చేస్తున్నాయి. మంచి కళాశాల, పాఠశాలల్లో వేయాలని చూస్తున్న వారికి కొన్ని కార్పొరేట్ సంస్థల పేరిట బురిడీ కొడుతున్నారు. అంతేకాదు ఇంటర్నేషన్ స్కూల్ అంటూ ప్రచారాలు చేసి తల్లిదండ్రులని తమవైపు మలుచుకుంటున్నారు. నిజామాబాద్ నగరంలో కొంతమంది అనుమతులు రాకపోయినా కార్పొరేట్ కళాశాలల పేరిట అడ్మిషన్లు మొదలుపెట్టారు.
ఇప్పటికే 144 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నట్లు సమాచారం. ఉన్న కళాశాలకే దిక్కులేంటే మరో కళాశాల పేరుతో నడుపుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇంటర్ విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తోక పేర్లను చూసి తల్లిదండ్రులు రూ.లక్షలు పెడుతున్న విషయం తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలున్నాయి. నామమాత్రంగా అనుమతులు లేని విద్యాసంస్థల్లో పిల్లలను చేర్చించొద్దంటూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసి మమ అంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విషయం తెలిసి మొదట్లో పలు విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేసి వదిలేశాయి. దీంతో ఆ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు మళ్లీ కొనసాగుతున్నాయి.
కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లు, కళాశాల తమదేనంటూ వివిధ మాధ్యమాల్లో యాజమాన్యాలు ప్రచారం చేస్తున్నాయి. లక్షలు పెట్టి హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, గోడ, కరపత్రాలు పంచుతున్నా ఇవేమీ సంబంధిత శాఖ అధికారుల దృష్టికి వెళ్లడం లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాఠశాల, కళాశాలలు స్థాపించాలంటే తప్పకుండా తమ అనుమతి ఉండాలని చెబుతున్న అధికారులే కిమ్మనకుండా ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అడ్డదారులు తొక్కుతున్న కార్పొరేట్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
జిల్లాలో కొంతమంది టెక్నో, ఇంటర్నేషన్ల పేరిట పలు పాఠశాలలను స్థాపించారు. వాటికి అనుమతులు ఉన్నాయా? ఇంటర్నేషనల్ పాఠశాలలకు ఉండాల్సిన నిబంధనలు పాటిస్తున్నారా? అనే విషయమై విద్యాశాఖ అధికారులకు పట్టింపు కరువైందనే ఆరోపణలు వస్తున్నాయి. తోక పేర్లతో అడ్మిషన్లు చేపడుతూ ఫీజులు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నా అధికారులు నోరు మెదపకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కార్పొరేట్ యాజమాన్యాలు సంబంధిత శాఖ అధికారులకు ముడుపులు సమర్పించుకోవడంతోనే పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
పిల్లలను చేర్పించే ముందుగానే సంబంధిత పాఠశాలకు అనుమతి ఉందో.. లేదో మండల విద్యాశాఖ అధికారిని అడిగి తెలుసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేస్తున్న పాఠశాలలని మూసివేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీచేశాం. సమస్యలు ఉన్న పాఠశాలలపై ఫిర్యాదు చేస్తే తక్షణమే సీజ్ చేస్తాం. అనుమతులు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించొద్దు.
-దుర్గాప్రసాద్, డీఈవో, నిజామాబాద్
జిల్లాలో అనుమతులు ఉన్న ఇంటర్ కళాశాలలు మాత్రమే అడ్మిషన్లు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. తోకపేర్లతో వివిధ కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకోవద్దు. కార్పొరేట్ కళాశాలలకు అనుమతులు రాలేదు. అనుమతులు వచ్చిన తర్వాతే అడ్మిషన్లు తీసుకోవాలి.