నాగిరెడ్డిపేట, మే 26: మండలంలోని పోచారం గ్రామస్తులు నూతన రహదారిపై సోమవారం ఆందోళన చేపట్టారు. రోడ్డు పనులు చేపట్టిన కేపీసీ కంపెనీకి చెందిన వాహనాలను అడ్డుకొన్నారు. గ్రామంలో నెలరోజుల క్రితం నూతన రహదారి నిర్మాణంలో భాగంగా రోడ్డు పక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రహరీ వరకు పనులు చేపట్టారు. రోడ్డు పక్కన డ్రైనేజీని నిర్మించకపోవడంతో కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పాఠశాల ప్రహరీ కూలిపోయింది. దీంతో వర్షపు నీరు నిలిచి పాఠశాల ఆవరణ చెరువును తలపిస్తున్నది.
ఈ విషయాన్ని కాంట్రాక్టర్ చెప్పి పదిరోజులవుతున్నా పట్టించుకోవడంలేదు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు సోమవారం పనులు చేపట్టిన కంపెనీకి సంబంధించిన వాహనాలను అడ్డుకొని, కాంట్రాక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై మల్లారెడ్డి, పనులు చేపట్టిన కేపీసీ కంపెనీ సూపర్వైజర్ రామిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు.
వారం రోజుల్లో పాఠశాల ప్రారంభమవుతుందని, వెంటనే డ్రైనేజీతోపాటు ప్రహరీ నిర్మించాలని గ్రామస్తులు కోరారు. హైవే అధికారుల నుంచి అనుమతు వస్తేనే తాము డ్రైనేజీ, ప్రహరీ నిర్మిస్తామని సదరు సూపర్వైజర్ స్పష్టం చేశారు. గ్రామస్తుల సూచన మేరకు పాఠశాలలో నిలిచిన నీటిని పొక్లెయిన్ ద్వారా తొలగింపజేశారు. అనంతరం గ్రామస్తులు తహసీల్ ఆఫీస్ చేరుకొని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. డ్రైనేజీతో పాటు ప్రహరి నిర్మించాలని తహసీల్దార్ శ్రీనివాస్‌ను కోరారు.