సిరికొండ, మార్చి 18 : నిజామాబాద్ జవహార్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరానికి ఆరవ తరగతి ప్రవేశం కోసం గత సంవత్సరం డిసెంబర్ మాసంలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అత్యంత ప్రతిభ కనబరిచి మంగళవారం విడుదలైన ఎంపిక జాబితాలో సత్యశోధక్ పాఠశాల విద్యార్థిని ఎం. హారిణి ఎంపికైనది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.నర్సయ్య హారిణిని అభినందించారు. ఆమె కృషి, పట్టుదల ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.
అనంతరం హారిణిని ప్రత్యేకంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో చదువుతూ తమ లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని ప్రిన్సిపాల్ సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడమే కాకుండా సమాజ అభివృద్ధికి తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.