కోటగిరి, జూన్ 19: పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో కోటగిరి ఎంపీడీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమకు వేతనాలు ఇవ్వకపోతే ఎలా బతికేదని ప్రశ్నించారు. రెండు నెలల నుంచి వేతనాలు చెల్లించడంలేదని తెలిపారు. ప్రభుత్వం, అధికారులు కార్మికులను చిన్న చూపు చూస్తున్నారని మండిపడ్డారు.
మేజర్ గ్రామ పంచాయతీ అయిన కోటగిరి జీపీలో నిధులు కొరత ఎలా ఉంటుందన్నారు. అధికారులు స్పందించి వెంటనే వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లిస్తేనే విధులు చేపడతామని స్పష్టం చేశారు. కార్మికుల ఆందోళనపై స్పందించిన ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, ఎంపీవో చందర్ నాలుగు రోజుల్లో వేతనాలు చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్, జిల్లా నాయకులు నాగన్న, కోటగిరి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.