సావిత్రీబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకుని బాలికా విద్యకు ప్రాధాన్యమివ్వాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. శనివారం సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా బాన్సువాడలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
బాన్సువాడ, జనవరి 21 : బాలికా విద్యకు ప్రాధా న్యం ఇవ్వాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. బాన్సువాడలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సావిత్రీ బాయి పూలే 192 జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సభాపతి పోచారం హాజరై మాట్లాడారు. ఎవరైతే సమాజానికి స్వార్థం లేకుండా పనిచేస్తారో వారిని సమాజం శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటుందన్నారు. అలాం టి గుర్తు పెట్టుకునే వ్యక్తుల్లో సమాజానికే జీవితాన్ని అంకితం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రీబాయి పూలే, దేశానికి భిక్ష పెట్టి రాజ్యాంగ నిర్మాతగా, దేశానికి దిశా నిర్దేశం చూపిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. అటువంటి మహనీయులను గుర్తుచేసుకోవాలని సూచించారు. మహాత్మా జ్యోతిరావ్ పూలే, సావిత్రీబాయి పూలే ప్రపంచానికి, దేశానికి ఒక దిక్సూచి అని అన్నారు.
మహిళలు ఒక ఉపాధ్యాయురాలు లేక డీఎస్పీ, ఎస్పీ, కలెక్టర్ అయ్యారంటే దాని వెనుక ఉన్నది ఎవరో కాదని, కేవలం విద్య అని అన్నారు. బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2200 మంది వివిధ కోర్సుల్లో కలిసి చదువుకుంటున్నారని, ఇందులో సుమారు 1200 మంది ఆడపిల్లలే ఉన్నారని తెలిపారు. సావిత్రీబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆడబిడ్డ ఇంటికి లక్ష్మి అని, ఆమె ను మంచిగా చదివించాలన్నారు. సావిత్రీ బాయి పూలే ఆశయాలకు అనుగుణంగా బాలికా విద్య పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
అనంతరం ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో, నిజామాబాద్ డీసీఈబీ సెక్రటరీ సీతయ్య ఆర్థిక సహకారంతో జిల్లాలోని 44 మంది మహిళా ఉపాధ్యాయులు, ఇతర శాఖల్లో విధులు నిర్వహించిన మహిళా ఉద్యోగులను సభాపతి సన్మానించారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘ సభ్యులను స్పీకర్ పోచారం అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఎస్సీ, ఎస్సీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ , ఆర్డీవో రాజాగౌడ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఎంపీపీ దొడ్ల నీరజ, గోపాల్ రెడ్డి, మహ్మద్ ఎజాస్, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు అయ్యాల సంతోష్, రవి, లకావత్ లక్యా నాయక్, రమావత్ గోపి, చంద్రశేఖర్, హీరాలాల్, గణపతి , సురేందర్, శంకర్ , మయూరి, వసంత, శకుంతల తదితరులు పాల్గొన్నారు.