బోధన్ రూరల్/రెంజల్/శక్కర్‌నగర్/నవీపేట్, జనవరి 1: పంట పెట్టుబడి కోసం అప్పులపాలు కావొద్దన్న ఉద్దేశంతో అమలు చేస్తున్న రైతుబంధుకు కర్షకులు జేజేలు పలుకుతున్నారు. అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్ ఆరంభంలోనే పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. పెట్టుబడికి రంది లేకుండా చేస్తున్న సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదంటున్నారు రైతులు. సమయానికి చేతికి డబ్బులు అందడంతో ఉత్సాహంగా సాగుబాట పడుతున్నారు. పంట పెట్టుబడి సాయం పొందేందుకు అన్నదాతలు వెళ్తుండడంతో ఏటీఎంలు, బ్యాంకుల వద్ద సందడి వాతావరణం నెలకొంటున్నది.
రైతుబంధు సాయం ఐదో రోజూ కొనసాగింది. పంట పెట్టుబడికి సీఎం కేసీఆర్ సర్కారు అందిస్తున్న డబ్బులు అందుకున్న రైతులోకం సంబురపడుతున్నది. సెల్ఫోన్లకు టింగ్..టింగ్‌మంటూ మెస్సేజ్‌లు వస్తుండగా.. యాసంగి సీజన్లో రైతుబంధు పదో విడుత నగదు బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నది. దీంతో డబ్బులు అందుకున్న రైతాంగం వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యింది. పలుచోట్ల ఎరువులు కొనుగోలు చేస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో నాట్లు వేసి కూలీలకు డబ్బులు చెల్లిస్తున్నారు. పంట వేసే సమయానికి పెట్టుబడి డబ్బులు అందడంతో రైతులంతా ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఎవుసానికి అప్పు చేసే అవకాశం లేకుండా పోయిందని, మాకు రంది లేకుండా చేస్తున్న సీఎం సార్‌కు రైతులంతా రుణపడి ఉంటామంటున్నారు.
మా జీవితాన్ని మార్చేసింది..
రెంజల్, జనవరి 1: నేను 36 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నా. గతంలో పాలించిన ప్రభుత్వాలకు రాని ఆలోచన సీఎం కేసీఆర్‌కు వచ్చింది. సార్ ఐడియా మా జీవితాన్నే మార్చేసింది. సకాలంలోఎరువులు, విత్తనాలు కొని, కైకిళ్లకు ఇవ్వడానికి రైతుబంధు డబ్బులు అందాయి. వ్యవసాయం ద్వారా ఆర్థికంగా బాగు పడేందుకు సర్కార్ ఎంతో సపోర్టు చేస్తున్నది.
ఎరువులు కొంటున్న..
శక్కర్‌నగర్, జనవరి 1: రైతుబంధు డబ్బులు సకాలంలో అందతున్నాయి. ఈ డబ్బులతో పంటకు కావాల్సిన ఎరువులను కొంటున్న. ఎదురుచూపులు లేకుండా పంటల సాగుకు అనుకూలమైన సమయంలోనే రైతుబంధు డబ్బులు అందుతున్నాయి. రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుబంధు ద్వారా రైతులను ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– శిరిశెట్టి నాగేశ్వర్రావు, ఎడపల్లి.
నాటినోళ్లకు ఇచ్చేసిన..
శక్కర్‌నగర్, జనవరి 1: నాకున్న పొలంలో వరి నాటేసిన. కూలీలకు డబ్బులు చెల్లించేందుకు ఎవరివైద్దెనా.. అప్పు తీసుకుందామని అనుకున్న సమయంలో సీఎం కేసీఆర్ అందించిన రైతుబంధు డబ్బులు బ్యాంకులో జమ అయినట్లు మెస్సేజ్ వచ్చింది. దీంతో ఇబ్బంది లేకుండా పోయింది. వెంటనే బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొని కూలీలకు చెల్లించా. రైతుబంధు డబ్బులు సకాలంలో అందుతున్నాయి.
– చింతల పెద్ద లక్ష్మణ్, ఎడపల్లి
అప్పులు చేసే తిప్పలు తప్పాయి..
శక్కర్‌నగర్, జనవరి 1: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ‘రైతుబంధు’ డబ్బులు.. పంట పెట్టుబడికి సాయమవుతున్నాయి. పంటల సాగుకు ముందుగా, పంటలు నాటే సమయంలో డబ్బులు రావడం సంతోషంగా ఉంది. మా రైతులను రైతుబంధు ఆదుకుంటున్నది. డబ్బులు సకాలంలో అందడంతో అప్పులు చేసే తిప్పలు తప్పాయి. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన ఈ పథకంతో రైతులమంతా సంతోషంగా ఉన్నాం.
– సిరివేణి మల్లేశ్, పుష్ప దంపతులు, ఒడ్డాపల్లి..
రంది లేకుంటైంది..
రెంజల్, జనవరి 1: సీఎం సార్ పెట్టుబడి సాయం అందిచ్చుట్ల పంటలు పండించేందుకు రంది లేకుంటైంది. సీజన్ అచ్చిందంటే షావుకారీ దగ్గరికి పోయి వడ్డీకి పైసల్ తెచ్చి ఎవుసం చేసేటోళ్లం. గిప్పుడు పైసల కోసం ఎవరిదగ్గర చేతులు చాపకుండా కేసీఆర్ సార్ బ్యాంక్ ఖాతాలల్ల పైసలు జమ చేస్తుండు. అట్ల రైతుబంధు పైసలు ఎయ్యంగనే నా ఫోన్‌కు టన్టన్ అంటూ మెస్సేజ్ అచ్చింది. బ్యాంక్‌కు పోయి పైసలు తెచ్చుకున్న.
– కుర్మె లలిత, రైతు, కళ్యాపూర్
కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం
బోధన్ రూరల్, జనవరి 1:రైతుబంధు పథకం అమలుతో సీఎం కేసీఆర్ మా కుటుంబాలకు ఆత్మబంధువు అయ్యిండు. నాకు ఎకరం పొలం ఉన్నది. పొలం దున్నే సీజన్ రాగానే కేసీఆర్సారు రైతుబంధు ఇస్తుండు. వచ్చిన పైసల్తో ఎరువుల బస్తాలు, నాట్లు వేసే కూలోల్ల పెట్టుబడులు ఎల్లుతున్నాయ్. తెలంగాణ రాకముందు రైతులను ఎవరూ పట్టించుకోలే. కేసీఆర్ వచ్చినంక రైతులకు ఇబ్బందులు లేకుండా వానకాలం, యాసంగి సీజన్లకు డబ్బులు ఇస్తూ అదుకుంటున్నడు. పంట పెట్టుబడికి రైతుబంధు సాయం అందజేస్తున్న కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– చాంగుబాయి, రాజీవ్‌నగర్ తండా, బోధన్
అప్పు తెచ్చే అవసరం లేదు
బోధన్ రూరల్, జనవరి 1: నాకు ఎకరం పొలం ఉన్నది. గతంలో షావుకారీ దగ్గర అప్పులు తెచ్చేది. పంట అమ్మిన పైసలే అటు కట్టేది. వచ్చిన లాభమంతా అప్పు తీర్చడానికే సరిపోయేది. మిగిలిన వాటితోనే సర్దుకుపోయేది. కేసీఆర్ రైతుబంధు పథకం పెట్టినంక మాకు ధైర్యం వచ్చింది. అప్పు చేసే అవసరం లేకుంటైంది. అదునుకు పెట్టుబడి సాయం అందిస్తూ కేసీఆర్ భరోసా ఇస్తున్నడు. ఇగ మాకు రంది లేదు.
– ఆర్. దశరథ్ నాయక్, రైతు, ఊట్పల్లి
రైతు కష్టం తెలిసిన కేసీఆర్ ..
బోధన్ రూరల్, జనవరి 1: నాకు రెండు ఎకరాల పొలం ఉన్నది. నా బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడినట్లు ఫోన్‌కు మెస్సేజ్ వచ్చింది. చాలా సంతోషమైంది. రైతు కష్టం విలువ తెలిసిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టం. రైతుబంధు పైసల్తో యాసంగి సాగుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నాం. ఇంక ఎరువులు కొనడానికి, నాట్లేసేందుకు పైసల ఇబ్బంది లేదు.
– కృష్ణ, రైతు, ఊట్పల్లి
సీఎం సార్ సల్లంగ ఉండాలె..
నవీపేట, జనవరి 1: నాకు ఐదు ఎకరాల పొలం ఉన్నది. అప్పు తెచ్చి ఎవుసం చేసేటోడిని.. ఇప్పడు అప్పుల బాధ తప్పింది. తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాత రైతుబంధు కింద 25వేలు నా ఖాతాలో జమ అయినవి. ఈ పైసలతో ఎరువులు కొనుక్కొని పొలం సాగు చేసుకుంటున్న. మాకు ఇంత సాయం చేస్తున్న కేసీఆర్ సార్ సల్లంగా ఉండాలె.
-నునావత్ బన్సీ, రైతు, శివతండా,నవీపేట
నిన్న పైసలు వడ్డయ్.. రేపు పొలం నాటుతా..
నవీపేట, జనవరి 1: రైతుబంధు పైసలతో నాకున్న మూడెకరాల పొలంలో పంట పండించుకొని ఏం రందీ లేకుండా సుఖంగా బతుకున్నాం. గతంలో నా కుటుంబాన్ని సాకాలంటే ఎంతో బాధపడేవాన్ని. సీఎం కేసీఆర్ పుణ్యంతో ఏడాదికి రెండుసార్లు రైతుబంధు పైసలు నా ఖాతాలో పడుతున్నయ్. నిన్ననే నా ఖాతాలో పైసల్ పడ్డట్లు నా ఫోన్‌కు మేస్సేజ్ వచ్చింది. ఆ పైసల్తో గెట్లు, దుక్కి దున్నుకుంటున్నాను. రేపు పొలం నాటుతా.
– మెగావత్ జగమల్, రైతు, శివతండా