గాంధారి, ఫిబ్రవరి 11: ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు రాక, ఎలాంటి పథకాలకు నోచుకోలేదు. పోడు రైతులు పడుతున్న కష్టాలను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్.. అటవీ భూములకు హక్కులను కల్పించడంతోపాటు ప్రభుత్వ పథకాలూ అందేలా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కామారెడ్డి జిల్లాలోని 34,280 ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తున్న దాదాపు 27,423 మంది రైతులకు ప్రయోజనం కలుగనున్నది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఏండ్లుగా ఉన్న సమస్య పరిష్కారం కానున్నది.
కామారెడ్డి జిల్లాలో 27,423మంది రైతులకు ప్రయోజనం..
రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇవ్వనుండడంతో కామారెడ్డి జిల్లాలో దాదాపు 27,423 మంది రైతులకు ప్రయోజనం కలుగనున్నది. జిల్లాలోని గాంధారి మండలంతోపాటు బాన్సువాడ, బీర్కూర్, బిచ్కుంద, దోమకొండ, జుక్కల్, లింగంపేట్, మాచారెడ్డి, మద్నూర్, నాగిరెడ్డిపేట్, నస్రూల్లాబాద్, నిజాంసాగర్, పెద్ద కొడప్గల్, రాజంపేట్, రామారెడ్డి, పిట్లం, సదాశివనగర్, తాడ్వాయి, ఎల్లారెడ్డి మండలాల్లో అటవీ భూములు విస్తరించి ఉన్నాయి. ఆయా మండలాల్లో చాలా మంది భూమిలేని నిరుపేదలైన గిరిజన, గిరిజనేతర రైతులు చాలా సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని 34, 280ఎకరాల అటవీ భూమిలో దాదాపు 11,282 మంది గిరిజనులు, 16,141 మంది గిరిజనేతర రైతులు సాగు చేసుకుంటున్నారు.
నిరుపేద గిరిజనులకు ప్రయోజనం
చాలా సంవత్సరాలుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషకరమైన విషయం. పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో చాలా మంది గిరిజనులకు ప్రయోజనం కలుగుతుంది. పోడు రైతులు సీఎం కేసీఆర్‌ని జీవితాంతం గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తారు.
– బలరాం నాయక్, బీఆర్ఎస్ నాయకుడు, వెంకటాపూర్ తండా, గాంధారి
గిరిపుత్రులను ఆదుకున్న నేత సీఎం కేసీఆర్..
రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం మంచి పథకాలను ప్రవేశపెట్టింది. ఎంతోకాలంగా, ఏ ప్రభుత్వాలూ గిరిజనులను పట్టించుకున్న పాపాన పోలేదు. అటవీ సంపదపై జీవిస్తున్న గిరిపుత్రులకు ఆదుకున్న నాయకుడు సీఎం కేసీఆర్. ఆయనకు గిరిజన లోకం ఎల్లవేళలా రుణపడి ఉంటుంది.
– బదావత్ బాల్సింగ్, సంగ్రాం నాయక్ తండా, బాన్సువాడ
పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద గిరిజనులకు హక్కు పత్రాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమైన విషయం. దీంతో చాలా మంది గిరిజనులకు ప్రయోజనం కలుగుతుంది.
– చందర్‌నాయక్, హేమ్లానాయక్తండా, గాంధారి
పోడు భూములకు పట్టా లు ఇచ్చేందుకు తీసుకున్న నిర్ణయం పేదోళ్లకు అన్నం పెట్టినట్టు. ఎంతో మంది నాయకులు గిరిజనుల ఓట్లు దండుకున్నారు కా నీ, లంబాడాలకు చేసింది ఏమీ లేదు. బీఆర్ఎస్ సర్కార్ గిరిపుత్రులకు అండగా నిలిచింది. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిలకు రుణపడి ఉంటాం.
– మూడ్ బిక్యా, రాంపూర్ తండా, బాన్సువాడ
రుణపడి ఉంటాం..
పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌కు గిరిజన సమాజం రుణపడి ఉంటుంది. సీఎం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వం అందించే రైతు సంక్షేమ పథకాలూ అందుతాయి. ఏండ్ల నాటి సమస్యకు పరిష్కారం చూపిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– రవీందర్, సర్పంచ్, గొల్లాడి తండా,
గాంధారి