సారంగాపూర్, ఫిబ్రవరి 2: రూరల్ మండలంలో కొందరు అక్రమార్కులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం దందా కొనసాగిస్తూ గుట్టలను మాయం చేస్తున్నారు. వీరి ధన దాహానికి గుట్టలు మాయమై మైదానాలుగా మారుతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో రాత్రివేళ తవ్వకాలు చేపడుతూ మొరం దందాను మూడు పువ్వులు, ఆరు కాయలుగా మార్చుకుంటున్నారు.
రూరల్ మండలంలోని మల్కాపూర్(ఏ), మల్లారం ధాత్రికటౌన్ షిప్, గుండారం, సారంగాపూర్, శాస్త్రీనగర్ శివారు ప్రాంతాల నుంచి కొన్ని నెలల క్రితం మధ్యాహ్నం వేళ అక్రమంగా మొరం తరలించడంతో గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అక్రమ రవాణాపై కలెక్టర్, మైనింగ్ ఏడీ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. పలు పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడల్లా మరుసటి రోజు నుంచి మొరం తవ్వకాలను నిలిపివేసేవారు. తర్వాత కొన్నిరోజులకు యథేచ్ఛగా అక్రమంగా మొరం రవాణా చేపట్టడం పరిపాటిగా మారింది.
కొన్ని నెలల నుంచి అక్రమార్కులు మొరం తరలించే ప్రక్రియ పంథాను మార్చుకున్నారు. పగటి వేళ కాకుండా అర్ధరాత్రి వేళ మాత్రమే తవ్వకాలు చేపడుతున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జాము 5 గంటల వరకు జేసీబీ సహాయంతో టిప్పర్లలో మొరం జోరుగా రవాణా చేస్తున్నారని ఆయా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులను మచ్చిక చేసుకుని అడ్డూ అదుపు లేకుండా మొరం దందా చేస్తున్నారు. మొరం అక్రమ రవాణాపై సంబంధిత శాఖల అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మల్కాపూర్(ఏ) గ్రామ శివారులో పెద్ద మొత్తంలో మొరం తవ్వకాలు చేపట్టి అక్రమంగా రవాణా చేస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు కొన్ని రోజుల పాటు రాత్రి 12 గంటల వరకు గస్తీ ఏర్పాటు చేసి అక్రమ రవాణాను నిలువరించారు. కానీ 12.30 గంటల నుంచి తెల్లవారు జాము 5 గంటల వరకు వాహనాల్లో మొరం తరలిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. మల్లారం గ్రామశివారులో ఉన్న ధాత్రిక టౌన్షిప్ శివారు నుంచి కూడా మొరం తవ్వకాలు చేపడుతున్నారు. గుండారం, సారంగాపూర్, మహ్మద్నగర్లో అక్రమంగా తరలిస్తున్న మొరం టిప్పర్లను వీడీసీ సభ్యులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. మొరం తవ్వకాలు నిలిపివేయకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించడంతో మొరం దందాకు బ్రేక్ పడిందని గ్రామస్తులు తెలిపారు.
మల్కాపూర్(ఏ) గ్రామశివారులో మొరం తవ్వకాలను 45 రోజుల క్రితం వీడీసీ సభ్యు లు అడ్డుకున్నారు. దీంతో కొన్ని రోజుల పాటు మొరం దందా నిలిచిపోయింది. అదే గ్రామానికి చెందిన కొందరు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసి తమ గోడును వినిపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎమ్మెల్యే నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతూ తరలిస్తున్నారు. దీంతో వీడీసీ సభ్యులు మొరం దందాను ఎమ్మెల్యే భూపతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ‘మీ ఊరు గుట్టంతా ఇప్పుడే అరిగిపోతుందా.. అవసరానికి మొరం తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లనివ్వండి’ అని ఖరాఖండిగా చెప్పడం తో చేసేదేమీలేక వీడీసీ భ్యులు మిన్నకుండిపోయినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని మొరం అక్రమ రవాణాను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అక్రమ రవాణాపై ఎమ్మెల్యే మౌనం!
అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రస్తుత రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మొరం తవ్వకాల విషయంలో బీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు చేశారు. గ్రామాల్లో ఉన్న గుట్టలను మాయం చేస్తున్నారని, తాను గెలిస్తే మొరం అక్రమ తవ్వకాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది.
ఇప్పుడు కాంగ్రెస్ నాయకులే వ్యాపారులుగా అవతారమెత్తి అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతుంటే ఎమ్మెల్యే భూపతిరెడ్డికి కనిపించడంలేదా అని మల్కాపూర్(ఏ), మల్లారం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మొరం తవ్వకాలకు అడ్డుకట్ట వేస్తానని ఎమ్మెల్యే చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. ఎమ్మెల్యే అండదండలతోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు మొరం దందా వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
మండలంలో మొరం తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వడంలేదు. మల్కాపూర్ శివారులో అక్రమంగా మొరం తరలించకుండా కాందార్లను రాత్రివేళ కాపలాగా ఉంచాం. రెవెన్యూతో పాటు మైనింగ్, విజిలెన్స్, పోలీసు శాఖ అధికారులకు కూడా సమాచారమిచ్చి అప్రమత్తం చేశాం. ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
-అనిరుధ్, తహసీల్దార్, నిజామాబాద్ మండలం